రికార్డు బ్రేక్‌.. ఆధిక్యం.. అద్భుతం

12 Mar, 2019 10:05 IST|Sakshi
డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

సాక్షి, నరసరావుపేట: ఏపీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే అత్యధిక మెజార్టీ ఓట్లు ఇచ్చి నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఐదుమార్లు, కాసు వెంకటకృష్ణారెడ్డి మూడుసార్లు తమ ప్రత్యర్థులపై గెలిచినా డాక్టర్‌ గోపిరెడ్డికి వచ్చి నంత మెజార్టీ తెచ్చుకోలేకపోవటం గమనార్హం. తొలిసారిగా 1955లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.  నరసరావు పేట అసెంబ్లీ నుంచి నల్లపాటి వెంకట రామయ్యచౌదరి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కరణం రంగారావుపై 12063 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1962లో చాపలమడుగు రామయ్యచౌదరి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా కొత్తూరి వెంకటేశ్వర్లుపై 2656 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1967లో  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కాసు బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిపై 13,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దొండేటి కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థి కొత్తూరి వెంకటేశ్వర్లుపై 14,587 ఓట్లతో గెలిచారు. 1978లో కాసు కుటుంబం నుంచి రాజకీయాలోక్లి ప్రవేశించిన కాసు వెంకటకృష్ణారెడ్డి జనతా పార్టీ అభ్యర్థి కొత్తూరి వెంకటేశ్వర్లుపై 6,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ రంగప్రవేశం చేసిన డాక్టర్‌ కోడెల  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బూచిపూడి సుబ్బారెడ్డిపై 14,557 ఓట్ల మెజార్టీతో తొలిసారిగా గెలిచారు.

1985 ఎన్నికల్లో డాక్టర్‌ కోడెల తన ప్రత్యర్థి కాసు కృష్ణారెడ్డిపై 2064 ఓట్లు, 1989లో ముండ్లమూరి రాధాకష్ణమూర్తిపై 9055 ఓట్లు, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డిపై 9300 ఓట్లు, 1999లో కాసు కృష్ణారెడ్డిపై 14306 ఓట్ల మెజార్టీతో వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు.  2004, 2009 ఎన్నికల్లో కాసు కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై 15,495, 5971 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో తొలి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్‌ గోపిరెడ్డి వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్‌ నలబోతు వెంకటరావుపై 15,766 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు.  

మరిన్ని వార్తలు