అమ్మను అనాథను చేశారు

14 Feb, 2018 09:31 IST|Sakshi
వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయం చేస్తున్న సుభాని, పక్కన కోడలు వీరమ్మ

బస్టాప్‌లో తల్లిని వదిలేసి వెళ్లిన వైనం

రెండు రోజులు నరకం అనుభవించిన వృద్ధురాలు

స్థానికుల సహాయంతో ఇంటికి తీసుకెళ్లిన కోడలు

ఆకు చాటు పిందె ముద్దు..తల్లి చాటు బిడ్డ ముద్దు..బిడ్డ ఎదిగి గడ్డమొస్తె..కన్న తల్లే అడ్డు అడ్డు..అని సినీగేయ రచయిత రాసి అక్షరాలను నిజం చేశారు ఈ పుత్రరత్నాలు. నలుగురు కొడుకులు..ఒకరికి మించి ఒకరిపై ప్రేమ కురిపించింది. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోనని తన గుండెలపై పెట్టుకుని లాలించింది..రెక్కలొచ్చాక బిడ్డలకు ఆ రెక్కలిచ్చిన తల్లి భారమైంది. గుట్టుచప్పుడు కాకుండా నడిరోడ్డుపై అనాథలా వదిలిపడేశారు. ఇదేందయ్యా అని అడిగే శక్తి లేక..నడిచే ఓపిక లేక జీవచ్ఛవంలా ఆ పండుటాకు కూలబడిపోయింది. అవస్థాన దశలో పడి ఉన్న ఈ అమ్మను చూసి చలించిపోయిన ఓ ఇద్దరు ఆమెకు ఆయువు పోయడంతోపాటు మానవత్వాన్నీ బతికించారు. మంగళవారం గుంటూరులోని కాకానిరోడ్డులో జరిగిన ఈ సంఘటన నేటి సమాజంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మానవీయ బంధాలను కళ్లకు కట్టింది. 

గుంటూరు(పట్నంబజారు):  రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన పుసులూరి ఉమామణికి 70 ఏళ్లు. భర్త ఆనందయ్య మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి శ్రీనివాసరావు, రమేష్, బాలకృష్ణ, కృష్ణార్జున కుమారులు. ఆనందయ్య చనిపోకముందే రెండు ఎకరాల పొలాన్ని అమ్మి వచ్చిన రెండున్నర కోట్లు కుమారులతోపాటు భార్యకు పంచారు. ఇటీవల మూడో కుమారుడు బాలకృష్ణ మృతి చెందాడు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వాహనంలో ఉమామణిని ఎవరో తీసుకొచ్చి కాకానిరోడ్డులోని వాసవి క్లాత్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఎండిన డొక్కలతో ఆ వృద్ధురాలు అక్కడే పడి ఉంది. గమనించిన స్థానికుడు శ్రీవారి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి. మణికంఠ వృద్ధురాలి ఆచూకీ కోసం ప్రయత్నించారు. శాఖమూరు గ్రామానికి చెందిన సుభాని అనే వ్యక్తి కారు రిపేరు నిమిత్తం వచ్చి వృద్ధురాలిని గుర్తించి బంధువులకు సమాచారాన్ని అందించారు.

మాతృమూర్తిని మరిచారు...
వృద్ధురాలి మూడో కుమారుడు బాలకృష్ణ భార్య వీరమ్మ, ఆమె కుమార్తెలు పద్మ, శిరీషలకు విషయాన్ని తెలియపరిచారు. మనమరాళ్లు పద్మ, శిరీషలు బస్‌స్టాప్‌ వద్దకు చేరుకుని తల్లికి విషయాన్ని చెప్పారు. అయితే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు, రెండో కుమారుడు రమేష్‌లకు తెలియజేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. రెండో కుమారుడి భార్య వీరమ్మ వృద్ధురాలి బాధ్యతను తాను చూసుకుంటానని శాఖమూరు తీసుకెళ్లింది.

మరిన్ని వార్తలు