మీ ఇళ్లూ ఇలాగే ఉంటాయా..?

25 Jan, 2018 11:38 IST|Sakshi
శానిటరీ సూపర్‌వైజర్‌ను హెచ్చరిస్తున్న డాక్టర్‌ షాలినీదేవి, డాక్టర్‌ ప్రశాంత్‌

ఆస్పత్రి సిబ్బందిపై కాయకల్ప రాష్ట్ర బృంద సభ్యుల మండిపాటు

నరసరావుపేట టౌన్‌ :  ‘ఏమిటీ ఈ దుర్వాసన.. మీ ఇళ్ళు కూడా ఇలానే ఉంటాయా.. రిజిష్టర్‌లో డ్యూటీ డాక్టర్‌ సంతకమేది? ఫ్యాన్లు, లైట్లు తిరగకపోతే పట్టించుకోరా..’ అంటూ వైద్యాధికారులను కాయకల్ప బృందం రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ షాలినీదేవి, డాక్టర్‌ ఇ.ప్రశాంత్‌ ప్రశ్నించారు. స్థానిక ఏరియా వైద్యశాలను బుధవారం సందర్శించిన వారు పలు విభాగాలను పరిశీలించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర విభాగంలోని రిజిష్ట్రర్‌లో డ్యూటీ డాక్టర్‌ సంతకం చేయకపోవటాన్ని తప్పుపట్టారు. విద్యుత్‌ వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న సేవల నాణ్యత, పారిశుద్ధ్యం, వైద్యశాల భవన పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. మొదటి స్థానంలో నిల్చిన వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. రెండో బహుమతిగా రూ.10 లక్షలు, మూడో బహుమతిగా రూ.6 లక్షలు ఇస్తారన్నారు. జిల్లా అంతటా వైద్యశాలలను పరిశీలించి నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు అందజేస్తామని డాక్టర్‌ షాలినీ తెలిపారు. ఆమె వెంట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోహనశేషు ప్రసాద్, డాక్టర్‌ లక్ష్మణ్, డాక్టర్‌ అంకినీడు ప్రసాద్, డాక్టర్‌ మాధవీలత, సిబ్బంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు