నోటీసు ఇవ్వకుండా ఓట్ల తొలగింపు నేరం

9 Feb, 2018 09:21 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌

ప్రధాన కార్యదర్శి బాలహనుమంత్‌రెడ్డి   

సత్తెనపల్లి: ఓటర్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఓటును తొలగించడం చట్టప్రకారం నేరమని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ న్యాయవాది కె.బాలహనుమంత్‌రెడ్డి చెప్పారు. చార్టర్‌ 13 ఎలక్షన్‌ మ్యాన్యువల్‌ ప్రకారం నోటీసు ఇచ్చి తీరాలన్నారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పట్టణంలో 9,632 ఓట్లను తొలగించడంపై కమిషనర్‌ శ్రీనివాసరావును ప్రశ్నించారు. బీఎల్‌వోలకు ట్యాబ్‌ల వాడకంలో పరిజ్ఞానం లేకపోవడంతో పొరపాటు జరిగిందని కమిషనర్‌ వివరణ ఇవ్వగా.. 40 మంది బీఎల్‌ఓలు పది వేల ఓట్లను రీ సర్వే చేయడం ఎలా సాధ్యమన్నారు. ఇందుకు మరో 10 రోజులు గడువును పొడగించాలని కోరారు. తొలగించిన ఓటర్లకు నోటీసులు ఇవ్వలేదని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఓటరు నమోదుకు ఆధార్‌ డిమాండ్‌ చేయకూడదని గుర్తుచేశారు.

రశీదు ఇవ్వాలి..
కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించగానే రశీదు ఇవ్వాలన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అపోహలకు తావు లేకుండా ఓటర్ల సర్వే చేయాలన్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి దేవసహాయం మాట్లాడుతూ ఉద్దేశ్యపూర్వకంగా ఓట్ల తొలగింపు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు పి.శంకర్‌బాబు, నగేష్, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌మీరాన్, టీడీపీ నేత రామచంద్రరావు, కాంగ్రెస్‌ నేత దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్, బీజేపీ నాయకుడు పగడాల సాంబశివరావు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు