విటమిన్‌ – డి తో కేన్సర్‌ ముప్పు తక్కువ...

16 Mar, 2018 08:36 IST|Sakshi

శరీరంలో విటమిన్‌ – డి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాలేయ కేన్సర్‌తోపాటు పలు ఇతర కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని జపాన్‌ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. సూర్యరశ్మి ఆసరాతో శరీరంలో తయారయ్యే విటమిన్‌ – డి... క్యాల్షియం మోతాదులను నియంత్రించడం ద్వారా ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. కేన్సర్ల విషయంలోనూ ఇది మేలు చేస్తుందని గతంలోనే కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కచ్చితమైన రుజువులు లేకపోవడం వల్ల విస్తృత ప్రచారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు దాదాపు 33 వేల మందిపై అధ్యయనం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రక్తంలో విటమిన్‌ – డి∙మోతాదులను నమోదు చేసుకున్న తరువాత వీరిపై దీర్ఘకాల పరిశోధనలు మొదలుపెట్టారు. 

ఋతువులకు అనుగుణంగా విటమిన్‌ – డి మోతాదులో వచ్చే మార్పులనూ పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు దాదాపు 16 ఏళ్లపాటు పరిశీలనలు కొనసాగించారు. ఈ కాలంలో వీరిలో దాదాపు 3301 మందికి కేన్సర్‌ సోకింది. వయసు, వ్యాయామం చేసే అలవాటు, ధూమపానం, మద్యపానం వంటి అన్ని ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ విటమిన్‌ – డి ఉన్న వారికి కేన్సర్‌ సోకే అవకాశాలు 20 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాలేయ కేన్సర్‌ విషయంలో ఇది 30 – 50 శాతం వరకూ ఉన్నట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల విషయంలో ప్రభావం పెద్దగా లేదు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని రూఢి చేసుకుంటే విటమిన్‌ –డి ని కేన్సర్‌ నిరోధక కార్యక్రమాల్లో వాడుకోవచ్చునని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు