మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?

28 Jul, 2014 14:41 IST|Sakshi
మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?

మీరు మా ఆఫీసులో సరఫరా చేసే మినరల్ వాటర్ తాగుతున్నారా? మీ వాటర్ ప్యూరిఫయర్ ను ఎన్నాళ్లకి ఓ సారి కడుగుతున్నారు? వాటర్ మంచి కంపెనీ నుంచే వచ్చి ఉండవచ్చు. కానీ వాటర్ ను తీసుకొచ్చే బబుల్స్ (ప్లాస్టిక్ సిలెండర్స్) ఎంత శుభ్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలను ఎప్పుడైనా వేసుకున్నారా?
ముంబాయిలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎం జీ ఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన వివరాలు చూస్తే కళ్లు తేలవేయడం ఖాయం.

ముంబాయిలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్ ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. మరి.. మీ ఆఫీసులో ఎలా ఉంది?

మరిన్ని వార్తలు