విద్యార్థి ప్రతిభను డీఎన్ఏ టెస్టుతో కొలవచ్చు!

22 Jul, 2016 17:46 IST|Sakshi

లండన్: పిల్లలలో ప్రతిభాపాటవాలను ముందుగానే గుర్తించి వారిలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఏర్పడింది. లండన్ లోని కింగ్స్ కాలేజికి చెందిన శాస్త్రవేత్తలు పిల్లల డీఎన్ఏపై పరిశోధనలు చేసి అకడమిక్స్ లో వారు రాణించే స్థాయిని ముందుగానే గుర్తించే టెక్నిక్ ను కనుగొన్నారు.

వయసుతో సంబంధం లేకుండా దాదాపు 20వేల మంది విద్యార్థులపై శాస్త్రజ్ఞుల బృందం ప్రత్యేక డీఎన్ఏ పరీక్షలు జరిపింది. 16 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థుల డీఎన్ఏల్లో మార్పులున్నట్లు వాటి ఫలితాల్లో గుర్తించింది. విద్యార్థులపై ఈ పరీక్షలు చేయడం ద్వారా నేర్చుకోవడంలో వెనుకబడుతున్న వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు.

కవలలపై పరిశోధనల వల్ల జన్యుపరమైన వివరాలు పూర్తిగా తెలుస్తాయని అన్నారు. వీరిలోని పాలీజెనిక్ స్కోర్ డీఎన్ఏ టెస్టులో అంతరాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఏ వ్యక్తిదైనా పాలీజెనిక్ స్కోర్ ను లెక్కించాలంటే జెనోమేవైడ్ అసోసియేషన్ స్టడీ(జీడబ్ల్యూఏఎస్) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కూడా పిల్లల్లో అకడమిక్ విజయాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు.

జన్యుపరమైన మార్పుల్లో ఒకటైన న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజమ్(ఎస్ఎన్ పీ) ద్వారా విద్యార్థుల్లోని చురుకుదనాన్ని సులువుగా గుర్తించవచ్చని చెప్పారు. ఎస్ఎన్ పీలు వ్యక్తిలోని ధృఢస్థిరాత్వాన్ని తెలియజేస్తాయని వీటిని ఎక్కువపాళ్లలో కలిగివున్న వారు మంచి విద్యావంతులవుతారని వివరించారు.

మరిన్ని వార్తలు