స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి

16 Mar, 2018 08:57 IST|Sakshi

నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ

ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్‌ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అని పేర్కొంటారు.

కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల  ∙స్పైన్‌ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

లక్షణాలు : ∙సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ :  మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్‌ స్పాండిలోసిస్‌ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.

నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.

చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు