ఫ్యాక్టరీలో విషవాయువులు: ఒకరి మృతి

1 Oct, 2015 12:20 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో వెలువడిన విషవాయువులు ఒకరి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానికంగా ఉండే వసంత కెమికల్స్ లో బుధవారం రాత్రి విషవాయువులు వెలువడ్డాయి. ఈ క్రమంలో కంపెనీలో రెండో షిప్టులో పనిచేస్తున్న నర్సింగరావు(39) విషవాయువులు పీల్చడంతో అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అతనిని గాంధీ ఆసుపత్రికి తరిలించింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సింగరావు మృతిచెందాడు.

దీంతో మృతుడి బంధువులు యాజమాన్యాన్ని వివరణ కోరగా వారు చర్చలు జరుపుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సరిగా స్పందించడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు