టెన్త్ పరీక్షల టైంటేబుల్ జారీ

10 Dec, 2015 04:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టైంటేబుల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌కు గతంలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం తెలిపినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విద్యాశాఖ దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం పంపింది. ఎట్టకేలకు ఈసీ నుంచి ఆమోదం లభించడంతో టైంటేబుల్‌ను ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి, ఓఎస్సెస్సీ(ఓరియంటల్ ఎస్సెస్సీ), వొకేషనల్ రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు (న్యూ సిలబస్) ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు.
 
 ద్వితీయ భాష పరీక్ష ఉదయం 9.30 నుంచి..
 ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక పేపరే ఉంటుంది. మిగతా సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి. ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయి. ఎస్సెస్సీ వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉంటుంది. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ పరీక్షలకు ఒకే సిలబస్, ఒకే ప్రశ్నపత్రాన్ని ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ కోర్సుతో సంబంధం లేని ప్రశ్నలకు సమాధానమిస్తే వారి సమాధానాలను పరిగణనలోకి తీసుకోరు. సరైన ప్రశ్నపత్రాలను అడిగి తీసుకునే బాధ్యత వారిదే.


 

మరిన్ని వార్తలు