తూర్పునకు వెళ్లే ‘బ్రిడ్జి’!

10 Jul, 2015 03:37 IST|Sakshi
తూర్పునకు వెళ్లే ‘బ్రిడ్జి’!

* ముల్లకట్ట వద్ద గోదావరిపై పూర్తికావచ్చిన 2 కి.మీ. హైలెవల్ బ్రిడ్జి
* హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు.. 190 కిలోమీటర్లు తగ్గనున్న దూరం

సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తూర్పు భారతదేశానికి వాణిజ్య కేంద్రంగా ఉన్న కోల్‌కతాకు రవాణా ఇక దగ్గర కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు, కోల్‌కతాకు ఉన్న రెండు రహదారి మార్గాల కంటే దూరం గణనీయంగా తగ్గనుంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తికావస్తోంది.

ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం మండలం పూసూరు-ముల్లకట్ట మధ్యలో 2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి పనులు చివరిదశకు వచ్చాయి. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు ఉన్న దూరం ఇప్పటికంటే 190 కిలోమీటర్లు తగ్గుతుందని జాతీయ రహదారుల శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ప్రస్తుతం రెండు రహదారులు ఉన్నాయి. హైదరాబాద్-భద్రాచలం-జగ్దల్‌పూర్-కోల్‌కతా రహదారి దూరం 1678 కిలోమీటర్లు.

హైదరాబాద్- నుంచి ఏపీలోని విజయవాడ-విశాఖపట్నం-భువనేశ్వర్-కోల్‌కతా రహదారి దూరం 1504 కిలోమీటర్లు. ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. వరంగల్ మీదుగా కోల్‌కతా రహదారి దూరం 1488 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే వాహనాలు ప్రస్తుతం విజయవాడ మీదుగానే వెళ్తున్నాయి.  ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా మీదుగా కోల్‌కతాకు వెళ్లే వాహనాలు భద్రాచలం మీదుగా వెళ్తున్నాయి.

అయితే, ఈ రెండు మార్గాల్లోనూ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండంతోపాటు, రోడ్డు ప్రమాద అవకాశాలూ ఎక్కువవడంతో  సరుకు రవాణాదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ముల్లకట్ట వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పశ్చిమబెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లకు వీరంతా ఈ మార్గాన్నే ఎంచుకునే అవకాశం ఉంది. వరంగల్ మీదుగా కోల్‌కతా, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా వల్ల దూరం తగ్గి భారీగా ఇంధనం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.
 
గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి..  
గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద ప్రారంభమై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు-జగన్నాథపురం గ్రామాల మధ్య ముగుస్తుంది. ఈ బ్రిడ్జి, అప్రోచ్‌రోడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ రహదారుల డివిజన్, మూడు సబ్ డివిజన్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీకుపల్లి వద్ద రాష్ట్ర సరిహద్దు ముగుస్తుంది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రారంభమవుతుంది.

ఏటూరునాగారం నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు.. పూసూరు నుంచి చీకుపల్లి వరకు రహదారి నిర్మాణం పూర్తికావచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారు. ప్రజా రవాణాకు కీలకమైన ఈ బ్రిడ్జికి అనుమతులు, నిధులు వచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.   నిర్మాణ పరమైన ప్లానింగ్ పూర్తయ్యాక 2012 మార్చిలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు చివరి దశలో.. ఛత్తీస్‌గఢ్ పరిధిలోని రహదారుల అభివృద్ధిని ఆ రాష్ట్ర అధికారులు మొదలుపెట్టారు. ఇవన్నీ పూర్తయితే, రవాణా మొదలై హైదరాబాద్‌కు తూర్పు తీరం 190 కిలోమీటర్లు దగ్గర కానుంది.
 
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ నుంచి భూపాలపట్నం రోడ్డును జాతీయ రహదారి (163)గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1998లో నిర్ణయించింది. గతంలో 202 జాతీయ రహదారి ఉంది. ఇటీవల హైవే నం. 163గా మార్చారు. ఈ రహదారిని మొదటి దశలో రెండు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖ నిధులను కేటాయించింది. 2002లో హైదరాబాద్-వరంగల్‌ల మధ్య రెండులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేశారు.

వరంగల్-పస్రా రోడ్డు అభివృద్ధి పనులు 2004 నాటికి పూర్తిచేశారు. పస్రా-ఏటూరునాగారం మధ్య రెండులైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. అటవీశాఖ అనుమతులు జాప్యం కావడంతో రహదారి అభివృద్ధి ఇంకా సాగుతూనే ఉంది. ములుగు-ఏటూరునాగారం మధ్యలో 28 కిలోమీటర్ల మేరకు ఈ జాతీయ రహదారి ఇంకా సింగిల్‌లైన్‌గానే ఉంది.
 
హైదరాబాద్-కోల్‌కతా రహదారులు

1488 కిలోమీటర్లు
హైదరాబాద్-వరంగల్-ఏటూరునాగారం-పూసూరు- భూపాలపట్నం-బీజాపూర్-దంతెవాడ-జగ్దల్‌పూర్-నౌరంగ్‌పూర్-భవానీపట్న-కుసూర్-బాలాగిర్-బల్లం- కియోంజ-ఖర్‌గూర్-కోల్‌కతా.
 
1504 కిలోమీటర్లు
హైదరాబాద్-సూర్యాపేట-విజయవాడ-విశాఖపట్నం- బరంపురం-భువనేశ్వర్-కటక్-బాలాసోర్-ఖరగ్‌పూర్-కోల్‌కతా.
 
1678 కిలోమీటర్లు
 హైదరాబాద్-సూర్యాపేట-ఖమ్మం-భద్రాచలం-సీలేరు- కుసూర్-బాలాగిర్-బల్లం-కియోంజ -ఖరగ్‌పూర్-కోల్‌కతా.

మరిన్ని వార్తలు