ఐదుగుర్ని కబళించిన కొండవాగు

17 Aug, 2015 04:27 IST|Sakshi
ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం ఇదే

- ఒకరు గల్లంతు  మృతులంతా కృష్ణా జిల్లా వాసులే
- ‘పశ్చిమ’ ఏజెన్సీలో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద దుర్ఘటన
 
బుట్టాయగూడెం:
కొండవాగు పొంగింది. గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లినవారిని ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామ శివారులోని అడవిలో ఆది వారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుం ది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లపూడి గ్రామం, విజయవాడ నగరంలోని మధురానగర్, పటమట ప్రాంతాలకు చెందిన 45 మంది వ్యాన్, ఆటోల్లో మంగమ్మ దర్శనానికి వచ్చారు. 7 గంటల సమయంలో గర్భగుడిలో పూజల్లో నిమగ్నమై ఉండగా.. తెల్లవారుజాము నుంచి కొండల్లో కురుస్తున్న వర్షంతో అకస్మాత్తుగా వాగు పొంగింది. ఆలయం గుహ పైనుండి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఊహించని ఘటనతో భక్తులు హాహాకారాలు చేస్తూ తలోదిక్కూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అప్పటికే పూజలు ముగించుకున్నవారితో పాటు మరికొందరు గట్టుపైకి చేరుకోగా సుమారు 20 మంది వాగులో కొట్టుకుపోయారు. స్థానిక వ్యాపారస్తులు ప్రాణాలకు తెగించి 5 మృతదేహాలను వెదికి పట్టుకున్నారు.

విజయవాడకు చెందిన ఏనుగుల మాధవి (22), వేముల లోకేష్ (13), కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మారీదు నరసమ్మ (62), ఆకుల కళ్యాణి (38) ఉప్పలపాటి దీపక్‌సాయి (15) మరణించగా, విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి (40) గల్లంతయ్యారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. వరద ఉధృతికి తోడు వాగులో ఉన్న బండరాళ్ల వల్ల తగిలిన గాయాలు మరణాలకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళతో పాటు మరో ఇద్దర్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగుకు ఎగువున చెక్ డ్యామ్ కూలిపోవడంతో వరద ఒక్కసారిగా విరుచుకుపడిందని అంటున్నారు.

మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లి..
మధురానగర్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఏనుగుల మంగమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు లారీ కొనుగోలు చేయడంతో మంగమ్మ కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, మనమళ్లు శనివారం రాత్రి బయలుదేరి మంగమ్మ దర్శనానికి వచ్చారు. వాగు పొంగిన ఘటనలో మంగమ్మ కుమార్తె వేముల ఉమాదేవి (34) గల్లంతయింది. ఈమె కోసం పొద్దుపోయేవరకు గాలింపు కొనసాగుతుండగా ఆమె కుమారుడు లోకేష్ (14), మంగమ్మ కోడలు కళ్యాణి మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదవాతావరణం అలుముకుంది.

మరిన్ని వార్తలు