6 ఎకరాల్లోనే కళాభారతి నిర్మిస్తాం

21 Jul, 2015 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల స్థలంలో  కేవలం ఆరు ఎకరాలను మాత్రమే కళాభారతి నిర్మాణం కోసం ఉపయోగిస్తామని, మిగిలిన స్థలాన్ని వాకర్స్, పార్కింగ్, పచ్చదనం, ఇతర అవసరాల కోసం వదిలేస్తామని జీహెచ్‌ఎంసీ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 10 ఎకరాల స్థలం ఉందని, ఇందులో 9 ఎకరాల స్థలంలో పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉంటుందని తెలిపింది.

వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపి తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన 14 ఎకరాల భూమిని తెలంగాణ కళాభారతి నిర్మాణంకు సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన ఎ.సుధాకర్ యాదవ్ ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు