స్థానికత ఆధారంగానే విభజన

1 Aug, 2015 02:32 IST|Sakshi
స్థానికత ఆధారంగానే విభజన

ఉద్యోగుల పంపిణీలో మరో విధానం వద్దని కేంద్రానికి స్పష్టం చేశాం: సీఎస్ రాజీవ్ శర్మ
సాక్షి, న్యూఢిల్లీ: స్థానికతను ఆధారంగా చేసుకునే ఉద్యోగుల విభజన జరగాలని కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. దీనికి మరో పద్ధతేదీ పెట్టుకోవద్దని కోరామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ ఉద్యోగుల ఇరు ప్రభుత్వాల వైఖరులను తెలియచేశారు.

అనంతరం రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడారు. 9వ షెడ్యూల్‌లోని ఉద్యోగుల విభజనతో పాటు ప్రత్యేకంగా విద్యుత్ ఉద్యోగుల అంశంపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలి. వేరే పద్ధతి పెట్టుకోవద్దని చెప్పాం. ఇక విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు కూడా చేశాం.

హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోం..’’ అని వెల్లడించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ సూచించారని చెప్పారు. కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున కమిటీ ఏర్పాటు సహా మరే ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పామన్నారు. కాగా సమావేశంలో ఏపీ తరఫున ఏం చెప్పారనే దానిపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ప్రశ్నించగా...వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

మరిన్ని వార్తలు