సర్కారు కాలేజీలపై ఆన్‌లైన్ నిఘా

17 Jul, 2015 00:55 IST|Sakshi
సర్కారు కాలేజీలపై ఆన్‌లైన్ నిఘా

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. కార్పొరేట్ కాలేజీల తాకిడిని తట్టుకొనేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్, ఆన్‌లైన్ విధానాలను అమలుపర్చేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు సహా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాలను అమలు చేయనున్నారు.

ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇప్పటికే కొన్ని కాలేజీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండడంతో గతేడాది పనిచేసిన కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు అందరినీ తిరిగి కొనసాగించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు నాలుగు వేల అధ్యాపకుల పోస్టులు అవసరముంది.

రెండేళ్లక్రితమే ఈ నియామకాలు చేపట్టాలని అధికారులు భావించినా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వమూ నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తాత్కాలిక సిబ్బందిని కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోతే రిటైరైన వారిని నియమించుకోవాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. మరోపక్క కాలేజీల్లో బోధన ప్రక్రియ మెరుగుపర్చేందుకు విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ (హాజరు నమోదు యంత్రాలు) పద్ధతిని అమలుచేయనున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ తెలిపారు.
 
మార్కుల సమాచారానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్
ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో అవగాహన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు తరచూ పరీక్షలు నిర్వహించేలా కొత్త ప్రణాళికను రూపొందించారు. పరీక్షలకు ప్రశ్నపత్రాన్ని బోర్డు నుంచే రూపొందింపచేసి అన్ని కాలేజీలకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. దాన్ని కాపీలు తీసి విద్యార్థులతో పరీక్షలు రాయిం చాలి. ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో తిరిగి ఆన్‌లైన్ ద్వారానే బోర్డుకు పంపాలి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకూ సంక్షిప్త సమాచారం ద్వారా మార్కులు తెలియజేస్తారు.
 
ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలు
ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. 12 లక్షల పాఠ్యపుస్తకాలకు గాను ఆరు లక్షల పుస్తకాల పంపిణీ పూర్తయ్యిందని, మరో ఆరు లక్షల పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని బోర్డు కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలనూ ఉచితంగానే  అందించనున్నామన్నారు. నల్లగొండ జిల్లాలోని మేథ ట్రస్టు వీటిని అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా