వాళ్లేం తప్పు చేయలేదు!

23 Jul, 2015 01:29 IST|Sakshi
వాళ్లేం తప్పు చేయలేదు!

సుష్మ, రాజే, చౌహాన్‌కు దన్నుగా నిలిచిన బీజేపీ
న్యూఢిల్లీ: వ్యాపమ్, లలిత్‌గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు దన్నుగా నిలవాలని బీజేపీ నిర్ణయించింది. వారు ఎలాంటి తప్పు చేయలేదని, రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. బుధవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ  సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

సుమారు 45 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేంద్రం చేపడుతున్న మంచి పనులతో పార్టీ ఎంపీలు సగర్వంగా తలెత్తుకోవాలన్నారు. పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజాయితీతో చక్కగా పనిచేస్తున్నారని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కితాబిచ్చారు.
 
లలిత్‌కు ఎలాంటి సాయం చేయలేదు
లలిత్ మోదీకి ఎలాంటి సాయం చేయలేదని సుష్మ ఎంపీలకు వివరించినట్లు భేటీ అనంతరం పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలిపారు. ‘నేను ఆయనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూర్చలేదు. భారత్ నుంచి పారిపోయేందుకు సాయపడలేదు. ఆయనకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఏనాడూ అడగలేదు. భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపకుండా లలిత్  అంశంపై నిర్ణయం తీసుకోవాలని మాత్రమే బ్రిటిష్ అధికారులకు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ గోరంతను కొండంత చూపేందుకు యత్నిస్తోంది’ అని సుష్మ అన్నట్లు నఖ్వీ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు