మబ్బులను వర్షాలుగా కురిపించాలి

13 Aug, 2015 03:47 IST|Sakshi
మబ్బులను వర్షాలుగా కురిపించాలి

- వాయుసేన సాయంతో మేఘమథనం జరపాలి
- చైనా మాదిరిగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
- పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి
 
సాక్షి, హైదరాబాద్:
ప్రస్తుతం వాతావరణంలో అనుకోని మార్పులు సంభవిస్తున్నాయని, ఈ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు అంతర్జాతీయంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులను దశలవారీగా ఉపసంహరించడం, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో సౌర, పవన శక్తి వంటివి ఎక్కువగా వాడడం ఇలాంటివే అని తెలిపారు. అయితే మనదేశంలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని, అందరూ వద్దనుకుంటున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులను మనం ఇప్పుడు పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కేపిటల్ ఫౌండేషన్ సంస్థ దేశంలో పర్యావరణ ఉద్యమకారులకు అందించే జస్టిస్ కుల్‌దీప్ సింగ్ జాతీయ అవార్డుకు ఎంపికైన పురుషోత్తమ్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ‘ రాయలసీమతోపాటు, దక్షిణ తెలంగాణలో తరుచూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు వెదర్ మాడిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వాటి ఆధ్వర్యంలో మేఘమథనం చేపట్టాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నాం. కేంద్రం చొరవ తీసుకుని జాతీయస్థాయిలో ఇలాంటి  సంస్థను ఏర్పాటు చేయాలి’ అని పేర్కొన్నారు.

‘రుతుపవనాల సీజన్‌లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మబ్బులు ఉంటాయి. మేఘమథనం ద్వారా వాటిని వర్షంగా కురిపించాలి. చైనా ఈ విషయంలో ఎన్నో విజయాలు సాధించింది కూడా. దాదాపు 55 వేల మంది సిబ్బంది, యుద్ధవిమానాలు, రాకెట్ లాంచర్లను ఉపయోగించి వీరు మేఘమథనం జరుపుతున్నారు. మనం కూడా భారత వాయుసేన సాయంతో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలి. వ్యవసాయ, ఇరిగేషన్ నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఈ ప్రాజెక్టును చేపట్టాలి’ అని పురుషోత్తమ్‌రెడ్డి సూచించారు. భారతదేశంలో వ్యవసాయ విధానం కూడా లోపభూయిష్టంగా ఉందని, దానిని మార్పుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
 
ప్రొ. పురుషోత్తమ్ రెడ్డికి జాతీయ అవార్డు
 ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన రిటైర్టు ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి కేపిటల్ ఫౌండేషన్ అందించే జస్టిస్ కులదీప్ సింగ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారని ఓయూ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 21న జరిగే పర్యావరణ సదస్సులో ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటారన్నా రు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలకు గాను ఆ పురస్కారానికి ఎంపికయ్యారు. పురుషోత్తమ్‌రెడ్డికి ఓ యూ రిజిస్ట్రార్ ప్రొ.సురేష్‌కుమార్, ఇతర అధికారుల అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు