వేం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

18 Jul, 2015 02:27 IST|Sakshi
వేం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

* ‘అంతిమ లబ్ధిదారు’ కావడంతో లోతుగా ఆరా
* డ్రైవర్, పనిమనిషి, సన్నిహితుల విచారణ

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘అంతిమ లబ్ధిదారు’ అయిన టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.

టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా వేం నరేందర్‌రెడ్డే ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు కావడంతో ఆయనపై ఏసీబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆధారాల సేకరణలో భాగంగా ఆయన డ్రైవర్ చిన్ని, ఇంట్లో పనిచేసే అర్జున్‌తో పాటు కుటుంబ సన్నిహితుడు వీరభద్రంచను కేసులో సాక్షులుగా పరిగణిస్తూ శుక్రవారం విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా వారిని ప్రశ్నించింది. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో విచారించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ కుట్ర ప్రారంభమైన నాటి నుంచీ వేం కదలికలు, ఆయన్ను కలిసిన వ్యక్తులకు సంబంధించే ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.
 
ఆ రెండు రోజులు ఏం జరిగింది?
మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పలువురు ‘ముఖ్య’ నేతలతో వేం సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి ప్రాథమిక సమాచారం లభించింది. దీనిపై డ్రైవర్ చిన్నికి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ప్రధానంగా మే 30, 31 తేదీల్లోవేం ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరితో భేటీ అయ్యారనే అంశాలను ఏసీబీ ఆరా తీసింది. ఇంట్లో జరిగిన విషయాల గురించి పనిమనిషి అర్జున్‌ను ప్రశ్నించింది.

మే 31న స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, కేసులో మరో నిందితుడు ఉదయసింహ ఇద్దరూ వేంతో సంప్రదింపులు జరిపినట్టు ఏసీబీ వద్ద ఆధారాలున్నాయి. వేం ఇంటికి ఎవరెవరు, ఎప్పుడెప్పుడొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారా, దేని గురించి మాట్లాడుకున్నారనే వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. నరేందర్ ఇంటికి రేవంత్ ఎన్నిసార్లు, ఎవరెవరితో కలిసి వచ్చారనే దానిపై కూడా అడిగినట్లు తెలిసింది. వీరభద్రానికి వేం ఆర్థికాంశాలతో సంబంధమున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది.

ఆ దిశగా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలపై వీడియో టేపుల వంటి పక్కా ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. మిగతా నిందితులకు సంబంధించి ప్రాథమికంగా సాంకేతిక ఆధారాలను సేకరించగలిగారు. మిగతా నిందితులు, అనుమానితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు నేర నిరూపణకు ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారి పాత్రకు సంబంధించిన సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరణపై దృష్టి పెట్టింది.

‘ఓటుకు కోట్లు’ కేసులో సర్కమ్‌స్టాన్షియల్ విట్నెస్‌లను (నేర సన్నాహాలను గమనించిన, నిందితులు, అనుమానితుల కదలికల్ని చూసిన, వాటి గురించి తెలిసినవారు) ఏసీబీ ముందునుంచీ గుర్తిస్తూ, వారి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు నాటికే ఇలాంటి 9 మంది సాక్షులను గుర్తించింది.

మరిన్ని వార్తలు