సీసీసీకి జంట టవర్లు

26 Jul, 2015 00:23 IST|Sakshi
సీసీసీకి జంట టవర్లు

సాక్షి, హైదరాబాద్: పక్కపక్కనే రెండు టవర్లు.. అంతా అద్దాలతో, మెరిసిపోయే డిజైన్‌తో ఒకదానిలో 16, మరోదానిలో 14 అంతస్తులు.. రెండు టవర్ల మధ్య హైలెవల్ వంతెన.. టవర్లపై హెలిప్యాడ్, సోలార్ రూఫ్... ఏమిటిదని అనుకుంటున్నారా, హైదరాబాద్‌లో నిర్మించనున్న అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)’ కార్యాలయ భవనం నమూనా. సీసీసీ భవన నమూనా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్లను ఆహ్వానించగా... 15 కంపెనీలు డిజైన్లు ఇచ్చాయి. వాటిని శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలసి పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు..

ఈ డిజైన్, హంగులు ఉన్న ఒక నమూనాను ఖరారు చేశారు. శనివారం సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సిటీ పోలీసు కమిషనరేట్‌కు ఇచ్చిన 8 ఎకరాల స్థలంలో సీసీసీ జంట భవంతులను నిర్మించనున్నారు. వీటిపై సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేసి విద్యుతోత్పత్తి చేస్తారు. సందర్శకుల కోసం కింది భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. నాలుగో అంతస్తులో సీసీసీ ప్రధాన హాలు ఉంటుంది. దాదాపు వెయ్యి మంది సామర్థ్యంతో ఆడిటోరియం, భవనం చుట్టూ ల్యాండ్ స్కేప్, నీటి ఫౌంటెయిన్‌లను ఏర్పాటు చేస్తారు.

భవనంలో ఇంకా ఏమేం ఉండాలో నిర్ణయించి, తుది మెరుగులు దిద్దాలని సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డిలతో కూడిన బృందానికి సీఎం సూచించారు. డిజైన్‌కు తుది రూపమిచ్చి, టెండర్లు పిలిచి నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉండే లక్ష సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానమై ఉంటాయని, జిల్లాల్లోని పోలీసు ప్రధాన కార్యాలయాలను కూడా సీసీసీకి అనుసంధానం చేయాలని సూచించారు. పుష్కరాలు, జాతరలు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయంలో పోలీసులే కాక ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సీసీసీ నుంచి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

పోలీసులు వీధుల్లో ఎక్కువగా తిరగకుండానే.. అణువణువునా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపయోగించే పద్ధతులను అధ్యయనం చేసి హైదరాబాద్‌లో సీసీసీ భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలకు తగ్గట్లుగా, స్మార్ట్ పోలీసింగ్‌కు సీసీసీ దోహదపడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు