గాలి రూటు మార్చింది

13 Dec, 2015 09:11 IST|Sakshi
గాలి రూటు మార్చింది

రెండ్రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు
సాధారణంకంటే 10 డిగ్రీలు అధికం
తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం

 
విశాఖపట్నం: వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్ల నుంచి వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు  అనూహ్యంగా దిశ మార్చుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ం, ద్రోణుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. అవి బలహీనపడడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అదే సమయంలో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లపై ఏర్పడ్డ అధిక పీడనం వల్ల శీతలంతో కూడిన వాయవ్య గాలులు వీయడంతో  అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు క్షీణించి చలి ప్రభావం చూపింది.
 
ఇంతలో ఇప్పుడు దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలులు వాయువ్య గాలులను అడ్డుకోవడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తెలంగాణలో 6 నుంచి 10 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లో 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.

అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణలో 5 నుంచి 6, ఆంధ్రప్రదేశ్‌లో 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలోని రామగుండంలో 24 (+10), నిజామాబాద్‌లో 23 (+10), హైదరాబాద్‌లో 21 (+6) నమోదయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 23 (+6), బాపట్ల 24 (+5), ఒంగోలు 25 (+4), మచిలీపట్నంలో 24 (+4) డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే తెలంగాణలోని నిజామాబాద్‌లో 35 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం 34 (+5), కర్నూలులో 34 (+4) డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
 
రెండు రోజులే..
కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల మరో రెండు రోజుల పాటే ఉంటుందని, ఆ తర్వాత క్షీణిస్తాయని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. విదర్భ, చత్తీస్‌గఢ్‌ల నుంచి వస్తున్న చల్లని వాయవ్య గాలులను దక్షిణ, ఆగ్నేయ గాలులు అడ్డుకోవడం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కారణమని ఆయన వివరించారు.
 
తేలికపాటి జల్లులకు అవకాశం
మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గడచిన 24 గంటల్లో ఇరు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు.

మరిన్ని వార్తలు