జపాన్ బృందంతో చంద్రబాబు భేటీ

2 Dec, 2015 12:48 IST|Sakshi
విజయవాడ: రాష్ట్రాన్ని కరువు రహితంగా చేసి, వ్యవసాయంలో నెంబర్ వన్ గా నిలబెడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా, ఏపీని అభివృద్ధిలో టాప్ 10 లో నిలుపుతామని చెప్పారు. జపాన్ తన పెట్టుబడులకు ఏపీ ని రెండో రాజధానిగా చేసుకోవాలని ఆయన అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో జపాన్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆక్వా, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రతినిధులు చెప్పారు.

ఆగ్రో ప్రాసెసింగ్ లో జపాన్, వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందున్నాయని, సాంకేతికతలో తిరుగులేని జపాన్, ఏపీలో పెట్టుబడులు పెట్టి మద్దతు ఇస్తే ఫుడ్ ప్రాసెసింగ్ లో అద్భుత ప్రగతి సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైన రంగాలని, రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్న ఏపీ.. పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పారు. మౌలిక వసతులు, నిరంతర విద్యుత్, సుదూర తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెగా పారిశ్రామిక కారిడార్లు, నైపుణ్యం కలిగిన యువత ఏపీ బలమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జపాన్‌కు చెందిన 30 పరిశ్రమల ప్రతినిధులు, దేశీయంగా 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు