విద్యుత్ ఉద్యోగుల విభజనపై కమిటీ

11 Mar, 2016 02:23 IST|Sakshi

* సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుకు హైకోర్టు ప్రతిపాదన
* సభ్యుల పేర్లు సిఫారసు చేయాలని రెండు రాష్ట్రాలకు సూచన విచారణ నేటికి వాయిదా


సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా మరొకరి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఉమ్మడి హైకోర్టు గురువారం ప్రతిపాదించింది. ఈ కమిటీలో సభ్యులుగా నియమించేందుకు నలుగురు లేదా ఐదుగురి పేర్లను సిఫారసు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందరి వాదనలు విన్న తర్వాత ఈ కమిటీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను రూపొందిస్తుందని, వాటి ఆధారంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై స్పందన తెలియజేసేందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, దీనికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై విచారణ సందర్భంగా కమిటీ ఏర్పాటు విషయాన్ని ధర్మాసనం ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వాలతో చర్చించి ఏ విషయం చెప్పాలని ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్(ఏజీ)లను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులు అందుబాటులోకి రాలేదని ఇరు రాష్ట్రాల ఏజీలు భోజన విరామం అనంతరం ధర్మాసనానికి తెలిపారు. దీంతో కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ స్పందిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పిటిషనర్లందరూ గతంలో ఉన్న చోటనే కొనసాగుతున్నారని చెప్పారు. అయితే వారికి ఎటువంటి పని చెప్పకపోగా.. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు కూడా ఇవ్వడంలేదన్నారు. ఇప్పుడు కమిటీ అంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కమిటీ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే ఈ నెలాఖరులోపు మార్గదర్శకాలు రూపొందించేలా తగిన మార్గనిర్దేశం చేస్తామని తెలిపింది. సభ్యులను త్వరగా సిఫారసు చేస్తే.. అంతే వేగంగా సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించింది. కమిటీ సభ్యులు తేలిన తర్వాత దానికి చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పేరును కూడా సూచించాలని కోరుతామంది. ఒక కమిటీ ఏర్పాటుకు అంగీకరించకుంటే తుది విచారణ జరిపి తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై మళ్లీ ఎవరో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని, దీంతో పరిష్కారం ఆలస్యమవుతుందని పేర్కొంది. ఇలా జరగకూడదనే కమిటీ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
 

మరిన్ని వార్తలు