సర్కార్‌పై దూకుడు పెంచుదాం

27 Jul, 2015 03:08 IST|Sakshi

కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడు పెంచాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నిర్ణయించింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై టీఆర్‌ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కోవాలని నిశ్చయించింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను నిలదీయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు.
 
‘ప్రాణహిత’ చుట్టూ చర్చ...
ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సాంకేతికంగా అధ్యయనం చేశాకే స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ పలువురు సభ్యులు అభిప్రాయపడగా ఈ ప్రతిపాదనను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులను కేసీఆర్ సర్కారు రాజకీయ కోణంలోనే సాంకేతిక కారణాల పేరిట మారుస్తోందని వాదించారు. దీనిపై సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్కకు మధ్య కొంత వాదన జరిగింది.

ప్రాణహితపై లోతుగా అధ్యయనం చేశాకే ఉద్యమించాలంటూ జానారెడ్డి చేసిన సూచనలపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రాణహితను పాత డిజైన్‌తో పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మారుస్తున్నారు. ఈ ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేయాలని ప్రభుత్వంపై మనం కొట్లాడాలి. దీనికి సాంకేతిక కారణాల సాకుతో మెతక వైఖరి మంచిది కాదు’ అని వాదించారు.

దీనిపై జానా స్పందిస్తూ ‘ఏ అంశమైనా లోతుగా పరిశీలించాకే పోరాటం మొదలుపెడతా. ఈ విషయంలో నా వైఖరిని తప్పుబడుతూ కొందరు మీడియాకు లీకులిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మనం చేసిందేమిటి, టీఆర్‌ఎస్ చేస్తున్నదేమిటి, దానివల్ల ప్రజలకు జరిగే నష్టం ఏమిటనే విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకొని అభాసుపాలు కాలేను. నా వైఖరి నచ్చకుంటే నాకు సెలవు ఇప్పించండి’ అన్నారు.

అనంతరం రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ‘పాత డిజైన్‌తో ప్రాణహితకు జాతీయహోదా సాధ్యం కాదని ఇటీవల జరిగిన పార్లమెంటు జలవనరులశాఖ స్టాండింగ్ కమిటీలో నిపుణులు నివేదించారు. దీనికి జాతీయ హోదా కోసం మార్పులు అవసరమవుతాయి’ అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. టీపీసీసీ కార్యక్రమాలపై సరైన సమాచారం ఉండటంలేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
కేంద్ర మంత్రి బర్తరఫ్‌కు తీర్మానం
రైతుల ఆత్మహత్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను బర్తరఫ్ చేయాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఉన్నందుకే 15 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసకుంటోందని, లక్ష ఉద్యోగాల భర్తీకోసం పోరాడాలని కొందరు సభ్యులు సూచించారు. కొందరు నేతలు పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ఎజెండా కోసం పాకులాడుతున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన సభ్యుడొకరు విమర్శించారు.
 
ఫిరాయింపులపై ధర్నాలు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా స్వయంగా సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే వారిపై వేటు వేయకుండా స్పీకర్ తాత్సారం చేస్తున్నారని సభ్యులు విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్‌కు హైకోర్టు నోటీసులను ఆసరాగా చేసుకుని దీనిపై తొలుత ప్రభుత్వానికి లేఖ రాయాలని, స్పందించకుంటే ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు.
 
తక్షణమే శాసనసభను సమావేశపర్చాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు వంటివాటిపై చర్చించడానికి తక్షణమే శాసనసభను సమావేశపర్చాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చామని, ఇక నుంచి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రుణమాఫీ అమలు చేయకపోవడం, ఇష్టారాజ్యంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన, వాటర్‌గ్రిడ్ వంటి అంశాలపై చర్చించడానికి తక్షణమే శాసనసభ సమావేశాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసింది.

సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్లు మార్చేందుకు ప్రభుత్వం చూపుతున్న కారణాల్లో అనేక అనుమానాలు  ఉన్నాయని, వీటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సమావేశం డిమాండ్ చేసిందని తెలిపారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం మంచిదేనని, అయితే కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయిన వాటికి నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని వారు ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా వాటర్‌గ్రిడ్‌ను చేపట్టడం వెనక కారణాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా ఇప్పటిదాకా ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించలేదని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల కొరత, వ్యవసాయ పంటరుణాల మాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉందని, రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ వరకే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించిందని, జిల్లాల్లో కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీటిపై వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి వెంటనే శాసనసభను సమావేశపర్చాలని సమావేశం డిమాండ్ చేసిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు