వేధింపులకు విద్యార్థిని బలి

24 Feb, 2016 12:31 IST|Sakshi

-కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన
రాజమండ్రి

ఆకతాయి వేధింపులకు ఓ విద్యార్థిని బలైపోయింది. రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతంలోని ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థిని గొర్ల అనూష జ్యోతి ఓ విద్యార్థి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు కళాశాల ముందు బుధవారం ఆందోళనకు దిగారు.

పోలీసులు, విద్యార్థులు అందించిన సమాచారం ప్రకారం... రంగంపేట మండలం రామవరంచండ్రేడు గ్రామానికి చెందిన అనూష జ్యోతి ఎస్‌కేవీటీ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి రోజూ కళాశాలకు వచ్చి వెళుతోంది. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి అదే కశాళాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి మణికంఠ ఆమెను వేధిస్తున్నాడు.

మాటలతో, ఎస్‌ఎంఎస్‌లతో వేధింపులకు గురి చేస్తున్నాడు. కళాశాల మానేస్తే ఇంటికే వచ్చేస్తానని బెదిరించాడు. భయపడిన అనూష సోమవారం కళాశాలకు వెళ్లలేదు. దీంతో మణికంఠ రామవరం చండ్రేడు గ్రామానికి వెళ్లాడు. దీంతో భయపడిన అనూష వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా మంటలకు ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులు ముగించుకుని రాత్రి 7 గంటలకు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగా అనూష ఇంట్లో ఓ మూలన బొగ్గుగా మారి కనిపించేసరికి నిశ్చేష్టులయ్యారు. దుఃఖాన్ని దిగమింగుకుని... తమ చిన్న కూతురు భావి జీవితానికి కష్టాలేమైన వస్తాయన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు కానిచ్చేశారు.

అయితే, ఈ విషయం తెలుసుకున్న కశాళాల విద్యార్థులు బుధవారం తమ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. అనూష ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసే దిశగా విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు