ప్రతి జిల్లాలో ‘వన్‌స్టాప్ క్రైసిస్’ కేంద్రం

25 Jul, 2015 03:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అత్యాచారానికి గురైన మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘వన్‌స్టాప్ క్రైసిస్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లాలో రెండు కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహిస్తారు. బాధితులకు సత్వర సేవలందించేందుకుగాను ఈ కేంద్రాల్లో ఒక డాక్టర్, నర్సు, న్యాయవాది, మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించనుంది. అత్యాచారానికి గురైన మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ‘నిర్భయ’ చట్టం తెచ్చినా, పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది.

దీంతో బాధిత మహిళలకు ఈ ‘వన్‌స్టాప్ క్రైసిస్’ సెంటర్ల ద్వారా అవసరమైన అన్ని సేవలను అందించాలని ప్రభుత్వం భావించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే గాంధీ ఆసుపత్రి, పేట్ల బురుజులోని ప్రభుత్వాసుపత్రిలో ఈ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఈ కేంద్రం ఏర్పాటుకు 300 చ.మీ. స్థలాన్ని కూడా కేటాయించారు. వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వనుందని మహిళా సంక్షేమ విభాగం అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రాంగణాల్లో  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

అనాథ బాలికలు, ఒంటరి మహిళలు ఉంటున్న ప్రాంతాల్లో అనుచిత సంఘటనలు జరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, రెస్క్యూ హోంలు, స్టేట్‌హోంలు, బాలసదన్‌లు తదితర ప్రాంగణాల్లో సీసీ కె మెరాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా ప్రాంగణాల్లో ఏర్పాటు చేసేందుకు 1,000 సీసీ కెమెరాలు కావాలని తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ విభాగానికి మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు లేఖ కూడా రాశారు.

మరిన్ని వార్తలు