విద్యుత్ ఉద్యోగులపై ‘ఈఆర్సీ’ నియంత్రణ!

20 Feb, 2016 04:03 IST|Sakshi

ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లవద్దని ఆదేశాలిచ్చిన ట్రాన్స్కో సీఎండీ
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలను ప్రశ్నిస్తూ విద్యుత్ ఉద్యోగులెవరూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని ఆశ్రయించవద్దని ఆదేశిస్తూ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈఆర్సీకి వెళితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యాజమాన్యం నుంచి అనుమతి లేకుండా విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఈఆర్సీను సంప్రదించకుండా, ఈఆర్సీ ముందు హాజరుకాకుండా, ఈఆర్సీని ఆశ్రయించకుండా ఉండేలా తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలు తమ ఉద్యోగులను ఆదేశించాలని కోరుతూ ఈ నెల 9న ఈఆర్సీ కార్యదర్శి లేఖ రాశారు.

విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీని ఆశ్రయిస్తే ‘ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్-1964’ను ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రామాణికంగా చూపుతూ ట్రాన్స్కో ఉద్యోగులెవరూ ఈఆర్సీతో సంప్రదింపులు జరపరాదని ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్కోలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా తమ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లకుండా సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వు ప్రతులను శుక్రవారం విద్యుత్ సౌధలో ఇంజనీర్లందరికీ అందజేశారు.

మరిన్ని వార్తలు