రైతు ఆత్మహత్యలకు బాధ్యత బాబుదే

31 Jul, 2015 01:10 IST|Sakshi
రైతు ఆత్మహత్యలకు బాధ్యత బాబుదే

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబునాయుడే పూర్తి నైతిక బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 2014 ఎన్నికలకు ఏడాదిన్నర ముందునుంచే అణాపైసలతోసహా రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నమ్మిన రైతులు మోసపోయారని, అప్పులు పుట్టక.. వ్యవసాయం చేసుకోలేక సర్వస్వం కోల్పోయి, సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

వీరి ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు. రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో సీఎం దృష్టికి తెస్తే లేదని తొలుత బుకాయించారు. జగన్ అనంతపురంజిల్లాలో రైతు భరోసాయాత్ర చేపడుతున్నారని తెలిశాక రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. తాజాగా రైతు కుటుంబాలకు రూ.ఒకటిన్నర లక్షలే ఇవ్వాలని జీవో విడుదల చేశారు’’ అని నెహ్రూ మండిపడ్డారు. అందుకే ఇది కత్తిరింపుల ప్రభుత్వమని తాము చెబుతున్నామన్నారు.
 
హామీలపై సమీక్షించుకోండి..
చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పటిదాకా జరిగిన మూడు అసెంబ్లీ సమావేశాల్లో కొనసాగిన చర్చల ఫలితంగా సర్కారు కొన్ని హామీలిచ్చిందని, వాటిని ఏమేరకు నెరవేర్చారో సమీక్షించుకుని పూర్తిచేయాలని నెహ్రూ సూచించారు. రెండు విడతలుగా రుణమాఫీ చేశామని, మూడోవిడత మాఫీకి సంబంధించిన రుణాలమొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆచరణలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టంచేశారు. బ్యాంకులకెళ్లి ఆరాతీస్తే రైతులు బాకీఉన్న రుణాలకు, ప్రభుత్వంనుంచి విడుదలైన మొత్తానికి పొంతనే లేదన్నారు. ఇక సామాజిక పింఛన్లలో ఏకంగా పది లక్షలమందికి ఎగనామం పెట్టారన్నారు.
 
వైఎస్ చిత్రపటం తొలగించడం సరికాదు..
శాసనసభ లాంజ్‌నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడం సరికాదని జ్యోతుల విమర్శించారు. పదవిలో ఉంటూ మృతిచెందిన ముఖ్యమంత్రి వైఎస్ ఒక్కరే కనుక ఆయన చిత్రపటాన్ని పెడుతున్నట్లు అప్పట్లో స్పీకర్ ప్రకటించారని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటి స్పీకర్ చేయడం సరికాదని సూచించారు. రిషితేశ్వరి మరణంపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఆగస్టు 6న తమపార్టీ ఎమ్మెల్యేలు నాగార్జున యూనివర్సిటీకి వెళుతున్నారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు