కొనేది 6... అమ్మేది 36

17 Oct, 2015 10:58 IST|Sakshi
కొనేది 6... అమ్మేది 36

    రైతుకు దక్కని మార్కెట్ ధర
    బహిరంగ మార్కెట్లో తగ్గని ధర
    కర్నూలులోనే భారీ తేడా
    కోల్‌కతాకు నిలిచిపోయిన ఎగుమతులు
    మార్కెట్‌లో పడిగాపులు కాస్తున్న రైతులు

 కర్నూలు: నిన్న మొన్నటిదాకా చుక్కలనంటిన ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోయింది. అయితే రైతు నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టపోతుండగా దళారులు, వ్యాపారులు మాత్రం భారీగా లాభాలు పొందుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు రైతు తెచ్చిన ఉల్లిని కొనేవారే కనిపించడంలేదు. కనా కష్టంగా కిలో ఆరు రూపాయలకు కొని, పక్కనే ఉన్న బహిరంగ మార్కెట్‌లో రూ. 36 కు అమ్ముతున్నారు.  మహారాష్ట్రలో ఉల్లి పంట భారీగా రావడం, కర్ణాటక రాష్ట్రంలోనూ దిగుబడులు పెరగడం, రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉల్లి సాగు పెరిగి దిగుబడులు మార్కెట్‌లోకి భారీగా వస్తున్నాయి. దాంతో రైతు నుంచి కొనుగోళ్లు మందగించాయి.  ధర క్రమంగా పడిపోతోంది.

కర్నూలు జిల్లాలో పండిన ఉల్లి 80 శాతం వరకు కోల్‌కతా... అక్కడి నుండి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుంది. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని కోల్‌కతాలో మార్కెట్ బంద్ కావడం.. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు నిలిచిపోవడం కూడా ధర తగ్గేందుకు కారణమైంది. ప్రస్తుతం రైతులు మార్కెట్‌లో ఉల్లిని అమ్ముకునేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. సోమవారం మార్కెట్‌కు వచ్చిన ఉల్లి దిగుబడులను శుక్రవారం వరకు కొనలేదంటే కొనుగోళ్లు ఏ స్థాయిలో నడుస్తుందో తెలుస్తోంది. గత నెలలో క్వింటా ఉల్లి ధర రూ. 5,800 వరకు చేరుకుంది. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా గరిష్టంగా కేవలం రూ. 1,600 మాత్రమే. 80 శాతం రైతులకు రూ. 600 నుండి రూ. 900 ధర మాత్రమే లభిస్తోంది. అంటే కిలో రూ. 6 నుంచి రూ. 9.
 కర్నూలులో ఒక రేటు.. హైదరాబాద్‌లో మరో రేటు
డోన్‌కు చెందిన బాలు అనే రైతు మంగళవారం కర్నూలు మార్కెట్‌కు లారీ ఉల్లి తీసుకొచ్చాడు. వేలం పాటలో క్వింటాకు రూ. 1,200 మాత్రమే లభించింది. ఈ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక హైదరాబాద్‌కు తరలించాడు. అక్కడ క్వింటా రూ. 2,100 ప్రకారం అమ్మడయింది. కర్నూలు మార్కెట్‌లో ధరలు ఏ స్థాయిలో పతనం అవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
 బహిరంగ మార్కెట్లో తగ్గని ధర
ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి ధర తగ్గడంతో రైతులు నష్టపోతుండగా, వినియోగదారులు మాత్రం ఇంకా ఎక్కువ ధరకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతుకు, వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న ధర వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. కర్నూలు మార్కెట్‌లో రైతులనుంచి సారాసరి కిలో రూ. 12 లకు కొనుగోలు చేస్తుండగా అదే కర్నూలులో బహిరంగ మార్కెట్‌లో వినియోగదారుడు రూ. 36 లకు కొనాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో రూ. 40, విజయవాడలో రూ. 35, విశాఖలో రూ. 38, తిరుపతిలో రూ. 35 లకు అమ్ముతున్నారు. వ్యాపారుల మాయాజాలంతో అటు రైతులు, ఇటు సాధారణ జనం నష్టపోతున్నారు.  

13వ తేదీ వచ్చినా ఉల్లిని కొనలేదు
గోనెగండ్ల మండలం వేముగోడులో ముక్కాలు ఎకరా భూమిలో ఉల్లి సాగు చేశా. 85 ప్యాకెట్ల (ఒక్కో ప్యాకెట్ 45 కిలోలు) పంట వచ్చింది. కర్నూలు వ్యవసాయమార్కెట్‌లో అమ్ముకునేందుకు ఈనెల 13న వచ్చినా. ఇంతవరకు  వేలం పాటకే రాలేదు. రోజు ఖర్చులు ఒక్కొక్కరికి రూ. 300 అవుతాంది. ఎప్పటికి కొంటారో తెలియదు. - ఎల్లయ్య

 పెట్టుబడిలో 50 శాతం కూడా రాలేదు
మాది కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి గ్రామం. ఎకరా భూమిలో ఉల్లి సాగు చేసినా రూ. 90 ప్యాకెట్ల పంట రాగా మంగళవారం మార్కెట్‌లో విక్రయానికి తీసుకొచ్చినా ధర పడిపోవడంతో దిక్కుతోచడం లేదు. పెట్టుబడి రూ. 35 వేలు పెట్టినా. ప్రస్తుత ధరతో పెట్టుబడిలో సంగం కూడా చేతికొచ్చేలా లేదు.    - రాముడు

>
మరిన్ని వార్తలు