నేడు కలామ్ అనంత యానం!

30 Jul, 2015 01:17 IST|Sakshi
రామేశ్వరంలో కలాం పార్థివదేహం వద్ద కలాం అన్న మహ్మద్ ముత్తు మీరా లెబ్బయి మరైకర్

పృథ్వీయాప తేజోవాయురాకాశములారా..! ఇతడు మీ పుత్రుడు. తన శస్త్రాలకు మీ పేర్లే పెట్టుకున్న మీ ప్రియ భక్తుడు. తన పాంచ భౌతిక దేహమును మీకు సమర్పిస్తున్నాడు. గైకొని ధన్యులు కండు.
 
అభ్ర మాలికలారా! అడ్డు తొలగండి... ఇతని ప్రయాణ పథము శుభ్రజ్యోత్స్న వలె కాంతులీనవలె.
 
ఓ చందమామా! ఇతడు నీ మేనల్లుడు. నీకంటే చల్లనివాడు. అనంతయానానికి పయనమైనాడు.  పున్నమి ఘడియలు ప్రవేశించకున్నా సరే, పూర్ణేందు రూపం దాల్చి దారి చూపు.
 
దివిజాంగనలారా! దోసిట సౌగంధికా పుష్పాలతో నిలిచి ఉండండి. పూలవాన కురిపించదగిన పుణ్య చరితుడితడు. మీ చెంతకు వస్తున్నాడు.

 
రామేశ్వరానికి చేరిన కలాం పార్థివ దేహం
* ప్రత్యేక విమానంలో మదురైకి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తరలింపు
* ఢిల్లీ నుంచి వెంట వచ్చిన వెంకయ్య, పారికర్
* నేడు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
* పేక్కరుంబు గ్రామంలో ఉదయం 11 గంటలకు నిర్వహణ
రామేశ్వరం/న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ అబ్దుల్ కలాం సొంతగడ్డ శోక జనసంద్రమైంది.. తమ ముద్దుబిడ్డను చివరిసారిగా చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజానీకం కన్నీటితో పోటెత్తింది.

కలాం పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బుధవారం ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి తీసుకువచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి తమిళనాడులోని మదురైకి ప్రత్యేక వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య.. కలాం భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛముంచి నివాళి అర్పించారు. తర్వాత కలాం భౌతిక కాయాన్ని హెలికాప్టర్ ద్వారా రామేశ్వరానికి పది కిలోమీటర్ల దూరంలోని మండపం ప్రాంతానికి చేర్చారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు ఢిల్లీ నుంచి కలాం పార్థివ దేహం వెంట వచ్చారు. మరో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వారితో కలిశారు.

అప్పటికే మండపం ప్రాంతానికి తమిళనాడు సీఎం జయ సూచన మేరకు పలువురు మంత్రులు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, నటుడు విజయ్‌కాంత్,  కలాం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ దిగగానే పెద్దసంఖ్యలో అభిమానులు అటువైపు తోసుకురాగా.. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అనంతరం కలాం పార్థివ దేహాన్ని ఒక సైనిక వాహనంపై ఉంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తరలించారు.

ఈ సందర్భంగా పది కిలోమీటర్ల మార్గం పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇరువైపులా నిలబడి నివాళి అర్పించి, కలాం రామేశ్వరానికి అందించిన సేవలను కొనియాడారు. కలాం పార్థివ దేహాన్ని రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి.. అనంతరం ఇక్కడి పళ్లివాసల్ వీధిలోని ఆయన పూర్వీకుల ఇంటికి తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
అంత్యక్రియలకు ప్రముఖులు..
గురువారం రామేశ్వరంలో జరుగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున కలాం అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని సీఎం జయలలిత బుధవారం ప్రకటించారు. కలాం అంటే తనకు ఎంతో గౌరవమని, తన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు మంత్రులను పంపుతున్నట్లు చెప్పారు. కలాం అంత్యక్రియలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్‌చాందీ తదితర సీఎంలు హాజరు కానున్నారు.
 
దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది: మోదీ
దేశం ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని ప్రధాని మోదీ బుధవారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రజలు ఎంతగానో ప్రేమించే, ఆరాధించే వ్యక్తి ఆయన. ప్రపంచం నుంచి ఆయన కొంతే తీసుకున్నారు. తాను మాత్రం అంతా ఇచ్చారు. పరిస్థితులకు ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు. భారత రక్షణ రంగానికి ఆయనే హీరో. అణు, అంతరిక్ష రంగాల్లో విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు..’ అని తెలిపారు. కాగా కలాం విజ్ఞానం దేశానికి ఎంతో మేలు చేసిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
 
ప్రపంచ నేతల నివాళి
వాషింగ్టన్: కలాం మృతికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు ఘనంగా నివాళి అర్పించారు. కలాం లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని కొనియాడారు. కలాం కిందిస్థాయి నుంచి దేశ నాయకుడిగా ఎదిగారని, అమెరికన్ల తరఫున ఆయనకు నివాళి అర్పిస్తున్నానని ఒబామా చెప్పారు.

ఆయన భారత్, అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని పెంచారని కొనియాడారు. కలాం భారత్, రష్యాల అనుబంధానికి కృషి చేశారని పుతిన్.. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కలాం మృతికి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సింగపూర్ అధ్యక్ష ప్రధానులు టోనీ టాన్ కెంగ్ యామ్, లీ సీన్ లూంగ్‌లు కూడా నివాళి అర్పించారు. వివిధ దేశాధినేతలు కలాం సేవలను కొనియాడారు.
 
అధికార లాంఛనాలతో..
చెన్నై, సాక్షి ప్రతినిధి: కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాంసంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
 
కలాం స్మారక మండపం: కలాం జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా రామేశ్వరంలో భారీ స్మారక మం డపం నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేక్కరుంబు గ్రామంలో కలాం పార్థివదేహాన్ని ఖననం చేస్తున్న స్థలానికి సమీపంలో ఉన్న 1.32 ఎకరాల ప్రభుత్వ భూమిలో మండపం నిర్మిస్తారు.

మరిన్ని వార్తలు