4 రోజులు భారీ వర్షాలు

14 Jun, 2017 01:51 IST|Sakshi
4 రోజులు భారీ వర్షాలు

► చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
►ఉట్నూరులో 10 సెం.మీ.ల వర్షపాతం
►ఊపందుకున్న నైరుతి
►రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు


సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, అందుకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని తెలిపారు. రుతుపవనాలు ప్రవేశించాక వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.

మరోవైపు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవంగా రుతుపవనాలు ప్రవేశించాక రాష్ట్రమంతటా విస్తరించేందుకు ఒక్కోసారి ఐదారు రోజులు పడుతుంది. కానీ మొదటి రోజు నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు సాధారణంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదవాల్సి ఉండగా 87.5 మి.మీ. రికార్డయింది. ఈ 13 రోజుల్లో ఏకంగా 123 శాతం వర్షపాతం నమోదైంది. జూన్‌ నెల మొత్తం సాధారణంగా 135.9 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా ఇప్పటికే 87.5 మి.మీ. రికార్డయింది. కాగా, గత 24 గంటల్లో ఉట్నూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సిర్పూరు, నారాయణఖేడ్‌లలో 9, ఆదిలాబాద్‌లో 8, గుండాల, మాచారెడ్డిలలో 7, సిరిసిల్ల, ముస్తాబాద్‌లలో 6, పాలకుర్తి, తాడ్వాయి, తిమ్మాపూర్, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున రికార్డయింది. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం హైదరాబాద్, మెదక్, హన్మకొండలలో పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 31 డిగ్రీలు రికార్డయింది.

మరిన్ని వార్తలు