‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’

17 Dec, 2015 10:35 IST|Sakshi
‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’
  • ఏలూరులో బరితెగించిన తెలుగు తమ్ముళ్లు
  • ముక్కలాట రూ. కోటిపైనే

  • ఏలూరు : అక్కడో... ఇక్కడో... ఎక్కడో ఎందుకు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడి ఇంట్లోనే పేకాట ఆడుకుంటే పోలీస్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడదు. ఇదే ప్లాన్ను ఏలూరులో పక్కాగా అమలు చేయాలని టీడీపీ నేతలు, బడాబాబులు భావించారు. బడా పేకాటరాయుళ్లు అనుకున్నదే తడవుగా నగరంలోని ఓ సీనియర్ టీడీపీ నేత వీరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నగర నడిబొడ్డున ఉన్న తన ఇంట్లోనే విచ్చలవిడిగా పేకాట ఆడుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

    ఊరికే కాదండోయ్.. ఇందుకు రోజుకు రూ.50 వేలు చెల్లించుకోండని ఓ రేటు కూడా నిర్ణయించారు. నగరంలో ఇంకెక్కడ పేకాట ఆడినా పోలీసులకు ఎంతోకొంత మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆ మొత్తమే సదరు నేతకు ఇచ్చుకుంటే ‘ఫుల్ సెక్యూరిటీ’ అని భావించిన పేకాటరాయుళ్లు ఆ డీల్‌కు ఒప్పుకుని ఎంచక్కా పేకాటలో మునిగితేలుతున్నారు.
     
    వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఏలూరు నగర నడిబొడ్డున కొద్దినెలలుగా ఓ టీడీపీ నేత ఇంట్లో పేకాట దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, ఆర్‌ఆర్ పేటలోని ఓ వస్త్ర దుకాణం యజమాని, ఏలూరులో ప్రభుత్వాసుపత్రికి చెందిన ఓ కాంట్రాక్టర్, మాదేపల్లికి చెందిన చేపల చెరువుల యజమాని, కృష్ణాజిల్లా  కైకలూరుకు చెందిన ఓ ఆరుగురు బడా వ్యాపారవేత్తలు.. ఇలా  20నుంచి 25మంది వరకు ‘బిగ్ షాట్స్’ ఆ నేత ఇంట్లో నిత్యం పేకాటలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవనంపై ప్రత్యేకంగా ఓ పోర్షన్‌ను సదరు ప్రజా ప్రతినిధి ఈ జూదానికి కేటాయించినట్టు సమాచారం.
     
    ‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’
    ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పేకాట ఆడుకున్నందుకు గాను రోజుకు రూ.అర లక్ష చొప్పున ఇస్తున్న పేకాటరాయుళ్లు ఇటీవల కాలంలో రూ.కోటి  ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యన కొందరు ఆటగాళ్లు.. వామ్మో కోటి ఇచ్చామా అని లెక్క వేసుకుని కొద్దిరోజులు అక్కడ ‘ఆట’ ఎత్తేశారట. దాంతో సదరు నేత ఫోన్‌చేసి ‘ఏమిటి రావడం లేదు. రూ.50 వేలు ఎక్కువనుకుంటే.. రూ.40 వేలు ఇవ్వండి. అదీకాదంటే రూ.30 వేలు ఇచ్చి ఆడుకోండి’ అని ‘డిస్కౌంట్’ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
     
    దీంతో అక్కడ జూదక్రీడ మళ్లీ జోరుగా సాగుతోందని అంటున్నారు. ముందుగా రూ.15 లక్షల వరకు  కోత ఆట (కోసాట), ఆ తర్వాతే ఓకులాట ఆడతారని, మొత్తంగా రోజుకు రూ.కోటిపైనే చేతులు మారతాయని  సమాచారం. ఆ టీడీపీ నేత ఊళ్లో ఉన్నా లేకున్నా ఆట మాత్రం నిర్విరామంగా కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతు న్నారు.

    వాస్తవానికి ఇక్కడ పెద్దమొత్తంలో పేకాట నడుస్తోందనే విషయం నగరంలోని కొంతమంది పోలీసులకు తెలిసినా దాడులు చేసే సాహసం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొలాలు, కాలువ గట్లపై పేకాట ఆడే వాళ్లను కాళ్లు చేతులు విరిగేట్టు చితకబాదే పోలీసులు నగరంలో నడిబొడ్డున రూ.కోట్లలో విచ్చలవిడిగా సాగుతున్న పేకాట శిబిరంవైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు.

మరిన్ని వార్తలు