భారీగా పెరిగిన కటాఫ్

25 Jul, 2015 03:55 IST|Sakshi
భారీగా పెరిగిన కటాఫ్

ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే మంచి కాలేజీల్లో సీట్లు లభించాయి. టాప్ కాలేజీల్లోని అన్ని బ్రాంచీల్లో కలిపి పరిశీలిస్తే... గతేడాదికంటే ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల సగటు ర్యాంకు సగానికిపైగా పెరిగింది. ఉదాహరణకు సీబీఐటీ వంటి కాలేజీలోని అన్ని బ్రాంచీల్లో గతేడాది 6వేల ర్యాంకు వరకు ఓసీ అభ్యర్థులకు సీట్లు వస్తే...

ఈసారి 3వేల ర్యాంకులోపే సీట్లన్నీ నిండిపోయాయి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు తగ్గిపోవడం, కోర్టు ఆదేశాల వల్ల వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టిన కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో కటాఫ్ భారీగా పెరిగిపోయింది. సీఎస్‌ఈ, ఈసీఈ వంటి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సీట్లు కేటాయించారు.

విద్యార్థులు క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్లి తమ ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. గత నెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా.. ఈనెల 17నుంచి 24వ రకు వెబ్ ఆప్షన్లు నిర్వహించారు.
 
34 కాలేజీలు మూతే!

ఈసారి 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 29 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరారు. ఈ 34 కాలేజీలు ఈసారి మూతపడే అవకాశముంది. ఇక 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య కూడా మరో 60 నుంచి 70 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈసారి వంద కాలే జీల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదన్నది అర్థం అవుతోంది. ఇక 100 శాతం ప్రవేశాలు జరిగిన కాలేజీలు 79 ఉన్నాయి.
 
9 వేల మందికి లభించని సీట్లు..
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 86,313 సీట్లు ఉండగా.. 53,347 సీట్లు (61.81 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 32,966 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 9,321 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. వారి ర్యాంకును బట్టి కాలేజీని ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.
 ఫార్మసీకి దెబ్బ: రాష్ట్రంలో 133 ఫార్మసీ కాలేజీల్లో 3,778 ఎంపీసీ స్ట్రీమ్ సీట్లు ఉండగా.. అందులో 125 సీట్లే భర్తీ అయ్యాయి. కాలేజీల సంఖ్య మేర కూడా విద్యార్థులు చేరలేదు.
 
ఇదీ చివరి దశ ప్రవేశాల షెడ్యూల్
* 29న మొదటి దశలో పాల్గొనని వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
* 29 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులు
* 31న సీట్ల కేటాయింపు
* ఆగస్టు 1న కాలేజీల్లో చేరేందుకు అవకాశం, అదే రోజునుంచి తరగతులు

మరిన్ని వార్తలు