ఆత్మహత్యలు వద్దు.. భరోసా ఇచ్చేందుకే వచ్చా..

25 Jul, 2015 02:48 IST|Sakshi
ఆత్మహత్యలు వద్దు.. భరోసా ఇచ్చేందుకే వచ్చా..

భరోసా యాత్రలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘రైతన్నలు, చేనేతలు, కార్మికులు చమటోడ్చి దేశాన్ని నిలుపుతుంటే వారికి అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల భూములను ఆక్రమించుకునేందుకు చట్టాన్నే మార్చాలని చూస్తోంది. లెక్కలేనన్ని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్ని వర్గాలను ఘోరంగా మోసం చేసింది’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ శుక్రవారం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అనంతరం ఓ.డి.చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు. రైతుల అనుమతి లేనిదే భూసేకరణ చేయకూడదని, ఆ భూమిలో ఐదేళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే వాటిని తిరిగి రైతులకు ఇచ్చేలా  కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే... నరేంద్రమోదీ పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టేందుకు చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు పూర్తిచేసే విధంగా తాము చట్టం తెస్తే.. ప్రధానమంత్రి వాటిని వెనక్కులాక్కొంటున్నారని ఆరోపించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడటంలేదో అర్థం కావడం లేదన్నారు. వాటిని సాధించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తానని చెప్పడానికే వచ్చానన్నారు.

అనంతరం డబురవారిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో డ్వాక్రా సంఘాలు బలోపేతంగా ఉంటే తప్పుడు హామీలతో చంద్రబాబు ఒక్కసారిగా నిర్వీర్యం చేశాడన్నారు. అధికారం కోసం చంద్రబాబు కోలుకోలేని దెబ్బ వేశాడన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశాడన్నారు. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల సరుకులు పంపిణీ చేయగా చంద్రబాబు ఆ పథకాన్ని ఎత్తివేసి ప్రస్తుతం ఏడాదికి ఒకసారి హిందువులకు ఉగాదికి, ముస్లింలకైతే రంజాన్, క్రిస్టియన్లకైతే క్రిస్ట్‌మస్‌కు సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు.

కొండకమర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం కళ్లారా చూసిన సోనియాగాంధీ.. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి సారిగా అనంతపురం జిల్లాలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.
 
ఆప్యాయంగా పలకరిస్తూ... కష్టాలు తెలుసుకుంటూ..
భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు, చేనేత, వలస కూలీల ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం అనంతపురం జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భరోసా యాత్రలో భాగంగా గ్రామ గ్రామాన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

బెంగళూరు నుంచి ఆయన ఓ.డి.చెరువుకు ఉదయం 9.30 గంటలకు చేరుకొని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోసం అప్పట్లో శాశ్వతంగా నిర్మించిన వేదిక వద్ద ఒక మొక్కను నాటి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్ద ఆత్మహత్యలు చేసుకున్న 38 మంది రైతు, చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం రైతులతో, విద్యార్థులతోనూ ముచ్చటించారు. ఆతర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డబురవారిపల్లిలో డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు