ఇంటర్ రూపురేఖలు మారుస్తాం: కడియం

27 Jul, 2015 03:25 IST|Sakshi
ఇంటర్ రూపురేఖలు మారుస్తాం: కడియం

హైదరాబాద్: విద్యార్థులకు ఇంటర్మీడియెట్ ఎంతో కీలకమైన దశ అని, మరో ఆరు నెలల్లో ఇంటర్ విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సి ఉందని, ఇంటర్ విద్యను కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ‘తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య-సంబరాలు, ఉచిత విద్య-అధ్యాపకుల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది.

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత ఇంటర్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి.. ప్రభుత్వ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఇంటర్ ఉచిత విద్యను ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రస్తుతం సాంఘిక, ఆర్థికపరమైన అసమానతలను చూస్తున్నామని, వీటన్నింటి కంటే ప్రమాదకరమైన విద్యా అసమానతలు రానున్నాయని చెప్పారు.  

2016-17 విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ ఉచిత విద్యను అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా అందరి అభిప్రాయాలను సేకరించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జీఏడీ గైడ్‌లైన్స్ రావడానికి వారం పడుతుందని, అవి అందగానే కాంట్రాక్టు లెక్చరర్లు శుభవార్తను వింటారని చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచే బాధ్యత తమదైతే.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో బోధన చేయాల్సిన బాధ్యత అధ్యాపకులదే అని అన్నారు.

కొత్త రాష్ట్రంలో ప్రమాణాలు పెంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.140 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి పూనుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్య ఒక వరం లాంటిదని, ఇలాంటి పథకాలతో తెలంగాణ విజ్ఞాన సొసైటీ కావాలని ఆకాంక్షించారు.

మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి 10 శాతం అడ్మిషన్లు పెరిగినట్లు చెప్పారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సి.విఠల్, ఇంటర్ కమిషనర్ డాక్టర్ ఎ. అశోక్ మాట్లాడారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణకు సహకరించిన మేథా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యుగంధర్‌రెడ్డిని సత్కరించారు.

మరిన్ని వార్తలు