టీఆర్‌ఎస్‌లోకి కొడంగల్‌ టీడీపీ నేతలు

21 Oct, 2017 05:18 IST|Sakshi

ఆహ్వానించిన మంత్రులు ఈటల, జూపల్లి, లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులకు నిధులివ్వని పరిస్థితి గతంలో ఉండేదని.. కానీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎంను నిత్యం తిడుతూ ఉన్నా కొడంగల్‌ అభివృద్ధికి కోట్ల నిధులను కేసీఆర్‌ ఇచ్చారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ పాలనలో మహబూబ్‌నగర్‌ గొప్ప జిల్లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సమక్షంలో కొడంగల్‌ నియోజకవర్గ టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మద్దూరు జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ నాయక్‌ సహా పలువురు సర్పంచులు, ఇతర నాయకులకు పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి మంత్రులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో శిఖండి పాత్ర పోషించిన రేవంత్‌.. ఇప్పుడూ అదే పాత్ర పోషిస్తున్నారని, అది గమనించి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు అభినందనలు అన్నారు. సీఎం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో కొడంగల్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లొస్తాయని, ఆ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి  తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గం మద్దూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఆ సభలో ఉంటాయని మంత్రి జూపల్లి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి పచ్చ జెండా కనబడదని, ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందనే కొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు