కృష్ణమ్మ ఒడ్డున వెంకన్న ఆలయం

19 Jul, 2015 02:17 IST|Sakshi
కృష్ణమ్మ ఒడ్డున వెంకన్న ఆలయం

వచ్చే ఏడాది పుష్కరాల్లోపు నిర్మించాలని టీటీడీ నిర్ణయం
సాక్షి,తిరుమల: కృష్ణానది ఒడ్డున శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో దాదాపు రూ.2 కోట్లతో తాత్కాలికంగా నమూనా ఆలయం నిర్మించారు. అదే తరహాలో విజయవాడ కేంద్రంగా జరగనున్న కృష్ణాపుష్కరాలకు కూడా తాత్కాలిక ఆలయం నిర్మించడం సరికాదనే యోచనలో టీటీడీ ఉంది.

ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు, న్యూఢిల్లీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి స్వామివారి దర్శన భాగ్యాన్ని టీటీడీ అక్కడి భక్తులకు కల్పిస్తోంది. అలాగే హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర, తమిళనాడులోని కన్యాకుమారిల్లో దాదాపు రూ.22 కోట్ల చొప్పున ఖర్చుతో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన రాష్ట్ర రాజధాని అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం శ్రేయస్కరమని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల్లోపు శ్రీవారి ఆలయాన్ని నిర్మించే అంశాన్ని త్వరలోనే ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు