పెద్ద ఘాట్లలో వైద్య శిబిరాలు

11 Jul, 2015 01:34 IST|Sakshi
పెద్ద ఘాట్లలో వైద్య శిబిరాలు

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వైద్య సౌకర్యాలు కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారమిక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదారు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 106 పుష్కర ఘాట్లు ఉండగా, అందులో 17 ఘాట్లు పెద్దవని చెప్పారు. పెద్ద ఘాట్ల వద్ద 24 గంటలూ వైద్య శిబిరాలు పనిచేస్తాయన్నారు.

ఆయా శిబిరాల వద్ద స్పెషలాఫీసర్, ముగ్గురు చొప్పున మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, అటెండర్లు పనిచేస్తారని వివరించారు. చిన్న ఘాట్లను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానం చేస్తామన్నారు. 104, 108 వాహనాలు, మందులు, పరికరాలను శిబిరాల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదు జిల్లాల్లో పుష్కరాల వద్ద వైద్య సేవలను పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లాకు రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమిస్తామని, ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలు పర్యవేక్షిస్తారని చెప్పారు.

నీటి కాలుష్యం వల్ల డయేరియా వంటివి వస్తాయని, తొక్కిసలాట, నీళ్లలో మునిగిపోవడం, గుండెపోటు వంటి ఘటనలు సంభవించే అవకాశాలు ఉంటాయని... వీటి బారినపడే వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లనూ అప్రమత్తం చేస్తామని తెలిపారు.
 
17 పెద్ద పుష్కర ఘాట్లు ఇవే...
బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కందకుర్తి, సోన్‌గూడెం, మంచిర్యాల, చెన్నూరు, మల్లూరు, మంగపేట, రాగన్నగూడెం, ముల్లకట్ట, పర్ణశాల, పోచంపాడు, తడపాగులు, కోటి లింగాల, మంథని.
 
వైద్య ఏర్పాట్లపై ప్రణాళిక
* తాత్కాలిక బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద వైద్య శిబిరాలు
* డీఎంహెచ్‌వో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే జిల్లాస్థాయి పర్యవేక్షణ సెల్
* హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కార్యాలయం నుంచి 24 గంటలూ పనిచేసే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్
* వెద్య సేవల కోసం రూ. 2.37 కోట్ల కేటాయింపు. అందులో మందుల కోసం రూ. 1.22 కోట్లు.

మరిన్ని వార్తలు