పోస్టల్ స్కామ్: లొంగిపోయిన ప్రధాన సూత్రధారి

8 Dec, 2016 20:11 IST|Sakshi
హైదరాబాద్: నగరంలోని పోస్టాఫీసుల్లో రూ.2.95కోట్ల నగదు అక్రమంగా మార్పిడి చేసిన కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు గురువారం పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు సీబీఐ, ఏసీబీ హైదరాబాద్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ బాబు కోసం అన్ని చోట్ల నిఘా పెట్టడంతో స్వయంగా ఆయనే లొంగిపోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం మరింత సమాచారం కోసం సుధీర్ బాబును విచారిస్తున్నట్లు చెప్పింది.
  
విశ్వసనీయ సమాచారంతో హిమాయత్ నగర్, గోల్కొండ, కర్వాన్ సాహు చౌక్ పోస్టాఫీస్లుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరుగుతోందని తెలిసి విజిలెన్స్ అధికారులతో పాటు మూడు శాఖలపై దాడులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారులు జీ శ్రీనివాస్, అబ్దుల్ గని, సురేష్ కుమార్, రవితేజలు రూ.2.95 కోట్ల కొత్త నోట్లను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అందించినట్లు గుర్తించామని తెలిపారు.
 
కేసులో ప్రధాననిందితుడైన పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆచూకీ లేకుండా పోవడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారున. అదుపులోకి తీసుకున్న సమయంలో వీరి నుంచి కీలక పత్రాలు, ల్యాప్ టాప్ లు, మొబైళ్లు, రూ.17.02 లక్షల నగదు(రూ.2వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని జ్యూడిషీయల్ కస్టడీకి పంపించి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు