అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మత్తయ్య

21 Feb, 2016 21:45 IST|Sakshi

గుంటూరు: ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు మత్తయ్య అనారోగ్యంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం అతనిని పలు సంఘాల నాయకులు పరామర్శించి, ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ఎమ్‌ఎల్‌సి ఎన్నికల్లో సీట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలు డీల్ కుదురుస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ నేతలు చిక్కిన విషయం విధితమే. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య నరసరావుపేట మీదుగా 2 రోజుల క్రితం ప్రయాణిస్తూ అస్వస్తతకు లోనయ్యాడు. సన్నిహితులు అతన్ని పట్టణంలోని మదర్‌థెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు.

విషయం తెలుసుకున్న ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ముస్లిం క్రైస్తవ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణా ఏసీబీ మత్తయ్యకు నోటీసులు ఇచ్చిన కారణంగా ఆందోళన చెందిన అతను హైబీపీ, షుగర్, హార్ట్ ప్రెజర్‌తో అస్వస్థతకు గురయ్యాడన్నారు. మత్తయ్యకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే తెలంగాణా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేసీఆర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దళితనాయకుడు మత్తయ్యపై పెట్టిన కేసును బేషరతుగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మత్తయ్య ఆరోగ్య విషయంపై స్పందించి సత్వరమే వైద్యసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 

>
మరిన్ని వార్తలు