ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు

10 Mar, 2016 03:25 IST|Sakshi
ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు

* కమలనాథన్ కమిటీ అంగీకరించిందన్న టీ వైద్యుల జేఏసీ
* జాబితా రద్దుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం!
* కమలనాథన్‌తో తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం


 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు దొర్లినమాట వాస్తవమేనని కమలనాథన్ కమిటీ అంగీకరించిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ లాలూప్రసాద్ చెప్పారు. విభజన జాబితాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఎస్‌పీ ఠక్కర్‌లు కమలనాథన్ కమిటీతో సమావేశమయ్యారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల అధిపతులు, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు.

జాబితాలో తప్పులు జరిగినట్లు కమలనాథన్ అంగీకరించారని డాక్టర్ లాలూప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో జాబితా రద్దుకు సంబంధించిన అంశంపై ప్రకటన చేస్తామని కమలనాథన్ తమకు హామీయిచ్చారని చెప్పారు. జాబితాలో అక్రమాలు జరిగాయని డీఎంఈ రమణి కూడా అంగీకరించారని తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది వైద్యులు ఒకటి నుంచి నాలుగో తరగతి సర్టిఫికెట్లను మాత్రమే ఇచ్చారని, కానీ ఐదు నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లను జత చేయలేదని తాము కమలనాథన్‌కు వివరించామన్నారు. భార్యాభర్తలు ఏపీలో ఉన్నా తెలంగాణకే కేటాయించారని, దీనిని అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేశారని లాలూ ప్రసాద్ ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు