అమ్మో... పుష్కరాలు అయిపోయాయ్!

26 Jul, 2015 03:50 IST|Sakshi
అమ్మో... పుష్కరాలు అయిపోయాయ్!

‘మొదటి’ (తొక్కిసలాట), ‘తొమ్మిది’ (అగ్నిప్రమాదం) దెబ్బల ఎఫెక్ట్‌తో దినదినగండంగా గడిపిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం పుష్కరాలు పూర్తికావడంతో ఊపిరిపీల్చుకున్నాయి. కొందరు అధికారులకు మాత్రం దీనికి భిన్నంగా గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. ‘వేటు(టా)’డేవాళ్ళు కాసుకుని కూర్చోవడమే దీనికి కారణం. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన విషయం విదితమే. దీనికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే ఆరోపణలు వస్తుండటంతో నష్ట నివారణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది.

ఇందులో భాగంగా ఈ ఉదంతానికి సంబంధించి ప్రాథమికంగా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ‘ఆయన అక్కడే ఉన్నారంటూ’ నోరు జారిన మరో అధికారి పైనా వేటుకు రంగం సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై పుష్కరాల అనంతరం చర్యలు తీసుకుంటామని, ఉన్నతస్థాయి విచారణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ‘ఆ నలుగురి’లో అప్పుడే పుష్కరాలు అయిపోయాయా! అనే భావన నెలకొంది.

ఇక దుర్ఘటనపై విచారణ కూడా ప్రారంభమైతే అందించాల్సిన నివేదికలు తదితరాల తయారీ, సమర్పణ భయం ఇతర ప్రభుత్వ యంత్రాంగాల్లో నెలకొంది. పోలీసు దర్యాప్తు, విచారణలు ఎన్ని మలుపులు తిరిగి ఎవరెవరి మెడకు ఎలా చుట్టుకుంటాయో అర్థంకాని పరిస్థితి అందరిలో గుబులు ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు