పాక్ హైకమిషన్ ఉద్యోగుల అరెస్టు

27 Oct, 2016 12:09 IST|Sakshi
పాక్ హైకమిషన్ ఉద్యోగుల అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను సదరు ఉద్యోగులు దొంగిలించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ లోని పాక్ హైకమిషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ అక్తర్ అనే ఉద్యోగి రక్షణ శాఖకు సంబంధించిన పత్రాలు దొంగిలించినట్లు చెప్పారు. 
 
ఇంటిలిజెన్స్ బ్యూరో సమాచారంతోనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్తర్ ను పట్టుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అక్తర్ ను చాణక్యపురి స్టేషన్ కు తరలించారు. పాక్ కు చెందిన కొంతమంది అధికారులు గూఢచర్యం చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ బ్యూరో ఏళ్లుగా అనుమానిస్తోంది. అప్పటినుంచి పాక్ ఉద్యోగులపై నిఘాను కట్టుదిట్టం చేసిన పోలీసులు అక్తర్, మరో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
 
హైకమిషన్ కు చెందిన ఉద్యోగి రక్షణ శాఖ పత్రాలతో దొరకడంపై పాకిస్తాన్ హైకమిషనర్ కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ లో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ కు సహకరిస్తున్న ఐదుగురు హైకమిషన్ ఉద్యోగులను భారత పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 
మాకు తెలియదు
పాకిస్తాన్ హైకమిషన్ కు చెందిన ఉద్యోగులను అరెస్టు చేసినట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని పాక్ హైకమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మీడియాలో వస్తున్న కథనాల గురించి మాత్రమే తెలుసునని చెప్పింది. అయితే, మీడియా రిపోర్టులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయబోమని తెలిపింది.
>
మరిన్ని వార్తలు