అప్పు తీర్చకుంటే రౌడీలతో రుబాబు

17 Dec, 2015 08:58 IST|Sakshi
అప్పు తీర్చకుంటే రౌడీలతో రుబాబు

రుణాలు వసూలు కాకపోతే రౌడీలను ఆశ్రయిస్తున్న వడ్డీ వ్యాపారులు
పోలీసు స్టేషన్‌కు వెళ్లనీయకుండా ప్రైవేటు సెటిల్‌మెంట్లు
అమలాపురంలో వడ్డీ రేట్లు రూ.10 నుంచి రూ.20
 
 
అమలాపురం  : అమలాపురంలో రౌడీయిజంపై పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వారి జులుంకు కళ్లెం వేయలేకపోతున్నారు. రౌడీలకు రాజకీయ అండ పుష్కలంగా ఉండటంతో కొన్ని సందర్భా ల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా అవి అరెస్ట్‌ల వరకూ వెళ్లడం లేదు. విజయవాడలో కాల్ మనీ-సెక్స్ రాకెట్ వెలుగు చూసిన నేపథ్యంలో మన జిల్లాలోనూ అప్పులు ఇచ్చిన వారి వేధింపులు, బెదిరింపులు ఎంత వేదనాభరితంగా ఉంటాయో తెలియజెప్పే సంఘటనలు ఉన్నాయి. అమలాపురంలో వడ్డీ వ్యాపారులు రౌడీలను ఆశ్రయించి వసూలు కాని అప్పులపై బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
 
రాజకీయ గొడుగు నీడలో..
అమలాపురంలో 150 మందికి పైగా బడా వడ్డీ వ్యాపారులు ఉన్నారు. వీరిలో 40 మంది పెద్ద వ్యాపారులకు అటు రాజకీయ నేతలు ఇటు రౌడీ షీటర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. వీరు ఎవరికి అప్పులు ఇచ్చినా అవి రూ.లక్షల్లోనే ఉంటాయి. వడ్డీ రేట్లు రూ.10 నుంచి రూ.20 వరకూ ఉంటాయి. వడ్డీ నెలనెలా వసూలు అయిపోతున్నంత వరకూ కథ సజావుగానే సాగిపోతుంది. అధిక వడ్డీల భారంతో రుణగ్రస్తుడు కొన్ని నెలల పాటు చెల్లించకపోయినా... ఇక అసలు ఇవ్వలేకపోరుునా వడ్డీ వ్యాపారులు తక్షణమే రౌడీలను ఆశ్రయిస్తారు. అంతే అప్పు తీసుకున్న వారికి ఫోన్లు... బెదిరింపులు మొదలవుతాయి.
 
 అదే స్థాయిలో వేధింపులూ ఉంటాయి. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయిద్దామనుకున్నా వారికి ఆ అవకాశం ఇవ్వరు. ప్రైవేటుగా సెటిల్‌మెంట్ చేస్తారు. అమలాపురంలో రూ.కోట్లు సంపాదించిన ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు రూ.కోట్లల్లోనే అధిక వడ్డీలకు రుణాలు ఇస్తారు. ఓ రుణం వసూలులో ఇబ్బందులు ఎదురుకావటంతో అధికార పార్టీ అండతో రుణగ్రస్తుడిపై పోలీసు కేసులు కూడా పెట్టించాడు.
 
 ఈ వ్యాపారి ఓ మంత్రి నా బంధువంటూ పోలీసుల దగ్గర తన దర్పాన్ని ప్రదర్శిస్తాడు. ఓ ప్రజాప్రతినిధి బంధువునంటూ ఓ రౌడీ ప్రైవేటు సెటిల్‌మెంట్లు తెగ చేస్తున్నాడు. ఓ పోలీసు అధికారి తండ్రి కూడా అధిక వడ్డీలకు రుణాలిస్తు న్నాడు. ఇటీవల ఒక రుణం వసూలు కాకపోతే తీసుకున్న అప్పునకు మించి రుణ గ్రస్తుడి ఆస్తులను రాజకీయ, అధికార అండతో అక్రమంగా జప్తు చేసేస్తున్నారు.
 
 6 గ్యాంగ్‌లు...115 మంది రౌడీలపై కేసులు నమోదు చేసినా...
 అమలాపురంలో గత ఏడాది కాలంలో రౌడీల ఆగడాలపై పట్టణ పోలీసు స్టేషన్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. పట్టణంలో తరచూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న ఆరు రౌడీ గ్యాంగ్‌లను పోలీసులు గుర్తించి ఆ గ్యాంగ్‌లకు చెందిన మొత్తం 115 మంది రౌడీలపై కేసులు నమోదుచేశారు. ఇందులో కొందరిని పోలీసులు నేరుగా అరెస్ట్ చేయగా... మరికొందరు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులు కాకుండా ఇటీవలే 30 మందిపై కొత్తగా రౌడీ షీట్లు... 44 మందిపై సస్పెక్ట్ షీట్లు (నేర చరిత్ర షీట్లు) తెరిచారు.
 
 పోలీసులు ఎంతసేపూ రౌడీ గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు స్కెచ్‌లు వేసుకుని హత్యయత్నాలకు... హత్యలకు వేసుకుంటున్న ఎత్తులు పై ఎత్తులపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వారు ప్రైవేట్ సెటిల్‌మెంట్లు పేరుతో చేస్తున్న దందాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టం లేదన్న విమర్శలు ఉన్నాయి. రౌడీల వెనుక రాజకీయ నేతల అండదండలు ఉన్నాయన్న కారణంతోనే వారు చేస్తున్న అన్ని రకాల నేరాలపైనా ఒకే రకమైన దృష్టి సారించలేకపోతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు