బిచ్చగాళ్ళమా...పోలీసులమా..

11 Jul, 2015 00:02 IST|Sakshi
పుష్కర విధులకోసం వచ్చేవారికి కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఆకలిబాధతో ఆరుబైట నిద్రిస్తున్న పోలీసు సిబ్బంది

రాజమండ్రి : 'పుష్కరాల విధులకు తీసుకువచ్చారు.. నగరానికి 20 కిలోమీటర్లు దూరంలో వదిలేసి.. మీచావు మీరు చావండి అంటూ వెళ్లిపోయారు.. అర్ధరాత్రి దాటుతున్నా అన్నం పెట్టే దిక్కులేదు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. మేం బిచ్చగాళ్లమో.. వరదబాధితులమో.. లేక పోలీసులమో మాకే అర్ధంకాని పరిస్థితి..'  ఇవీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటోన్న గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల స్థితి. వారే చెబుతోన్న దుస్థితి. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లాకు చెంది 1200మంది పోలీసుసిబ్బంది గురువారం మధ్యాహ్నాం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. వారికి రాజమండ్రి బివిఎంస్కూల్‌లో వసతి కల్పించారు.అయితే శుక్రవారం అక్కడ నుంచి రాజానగరం మండల భూపాలపట్నంలోని రైట్‌కళాశాలకు బస మార్చారు. ఆ ప్రాంతంలో కనీసం వాటర్‌బాటిల్ దొకికే షాపులు కూడా ఉండవు. మూడు కిలోమీటర్లు నడిచే వస్తే తప్ప బిస్కట్లయినా దొరకని పరిస్థితి. విధులు నిర్వర్తించేందుకు అలాంటి ప్రాంతానికి వచ్చిన పోలీసు సిబ్బందికి భోజనం కాదుకదా.. కనీసం మంచినీళ్లైనా అందించలేదు నిర్వాహకులు.

తట్టుకోలేక రాజమండ్రి రావాలంటే రూ.300ఆటోకు ఖర్చుపెడితే తప్ప తిని వెళ్ళే పరిస్థితిలేదు. దీంతో పోలీసుసిబ్బంది ఆకలిమంటలు తట్టుకోలేక రాత్రి 07.30 గంటల సమయం నుంచి ఆందోళన మొదలు పెట్టారు. అయినప్పటికీ పోలీసు అధికారులు వచ్చి చర్చలు జరుపుతున్నారే తప్ప వారికి కావాల్సిన బోజనంను మాత్రం సమకూర్చలేకపోయారు. దీంతో పోలీసుసిబ్బంది వెంటనే తమను విధులనుంచి వెనక్కి పంపించేయాలని, డీఏ కూడా కేవలం రూ.50 ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బోజనం అయినా పెట్టించలేనప్పుడు పుష్కరాల విధులకు ఎందుకు తీసుకురావాలని పోలీసుఅధికారులపై విరుచుకుపడ్డారు. కళాశాల ఆవరణలో తేలులు ఉన్నాయని, మూడు తేళ్ళను చంపామని, ఎవరికైన ఏమైన జరిగితే అర్బన్ ఎస్పీ బాద్యత వహిస్తారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

మధుమేహ,హార్ట్‌పేషెంట్‌లు అధికంగా ఉన్నారని సమయానికి బోజనం చేయకపోవడం వలన కుప్పకూలేపరిస్థితి ఏర్పడిందన్నారు. 1200 మందికి కేవలం 25రూమ్‌లు కేటాయించడంతో అందరూ వరండాలలో,బయట పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లా పోలీసులకే ఈపరిస్థితే దాపరిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటని వారి ప్రశ్నించారు. స్వయానా ఉపముఖ్యమంత్రి,హోంమంత్రి స్వంత జిల్లాలో కనీసం పోలీసులకు బోజనం పెట్టేపరిస్థితి ఒక్కడ ఎస్పీలకు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 11.00గంటల సమయంలో బోజనాలు వచ్చినప్పటికీ పోలీసుసిబ్బంది తిరస్కరించడంతో పోలీసు అధికారులు వారితో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు