నీకు నేనున్నా!

30 Jul, 2015 03:08 IST|Sakshi
నీకు నేనున్నా!

ప్రత్యూషతో సీఎం కేసీఆర్
* కష్టపడి చదివి పైకి రావాలమ్మా
* ధైర్యంగా ఉండు.. ఇకపై నీ జోలికి ఎవరూ రారు

సాక్షి, హైదరాబాద్: ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి సపోర్టు దొరికింది. దీన్ని ఉపయోగించుకోవాలి. బాగా చదవాలి. పైకి రావాలి. నిన్ను బాధపెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష అదే. ఇకపై నీ తెరువుకెవరూ రారు. ధైర్యంగా ఉండు. అన్నింటికీ నేనున్నా. ఎప్పుడైనా నా ఇంటికి రావొచ్చు.. పోవచ్చు.

నాకు ఫోన్ చేయవచ్చు...’’ అని కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసకు గురైన ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రత్యూషను ఇటీవలే సీఎం దంపతులు పరామర్శించిన సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత తమ ఇంటికి రావాలని సీఎం ఆహ్వానించారు. దీంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచిన అధికారులు అక్కడ్నుంచి నేరుగా సీఎం ఇంటికి తీసుకొచ్చారు.

సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషను సీఎం తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత పెద్ది సుదర్శన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యూషతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రత్యూష చదువు బాధ్యతంతా ప్రభుత్వమే భరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కడియం శ్రీహరిని ఆదేశించారు.

ప్రత్యూష చదువు, వసతి, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌లను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యూషకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులో ఆమె పేరుతో అకౌంట్ తీసి ఆ డబ్బులు జమ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత ఫోన్ నంబర్లు ప్రత్యూషకు ఇచ్చిన సీఎం.. తాను అండగా ఉన్నానన్న సంగతి మరవొద్దని చెప్పారు. అనంతరం ప్రత్యూషను కీసర మండలంలోని ఓ వసతి గృహానికి తరలించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు