కంచే చేను మేస్తే..

7 Apr, 2016 04:21 IST|Sakshi
కంచే చేను మేస్తే..

రెవెన్యూ సిబ్బంది చేతివాటం
పేరు, సర్వే నంబర్లు లేకుండా పట్టాలు
వీఆర్వోలు, వారి బంధువుల పేర్లతో భూముల మార్పు
పట్టా భూములుగా మారుతున్న ప్రభుత్వ భూములు

 
 కలువాయి మండలం నూకనపల్లిలో సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమి మీరయ్య పేరుతో ఉంది. ఈ భూమిని స్థానిక వీఆర్వో తన తల్లిపేరుతో మార్పు చేశాడు.నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్‌మోపురు గ్రామంలో సర్వే నంబర్ 89-డీలో 2.74 ఎకరాల భూమి వెంకటసుబ్బారెడ్డి పేరుతో ఉంది. దీనిని వీఆర్వో తన పేరుతో మార్పు చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. కంచే చేను మేసిన చందాన రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పేదల భూములు పరిరక్షించాల్సిన రెవెన్యూ సిబ్బంది రాబందుల్లా మారుతున్నారు. చేతివాటం ప్రదర్శించి నిరుపేదల భూములును ఆక్రమించి పేర్లు మార్పు చేస్తున్నారు.

 నెల్లూరు(పొగతోట) : అల్లూరుకు చెందిన సత్యనారాయణకు సర్వే నంబర్ 348-1లో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భూముల అనుభవం మరోకరి పేరుతో ఉందని రికార్డులో నమోదు చేశారు. పాసుపుస్తకాల కోసం సత్యనారాయణ అధికారుల చుట్టు తిరుగుతుంటే భూములు నీపేరుతో లేవని అధికారులు చెబుతున్నారు. చిల్లకూరు మండలంలో ఇదే పరిస్థితి. సమస్య ఏంటని మండల రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే పక్క పోలం అతను ఫిర్యాదు చేశాడు. దీంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని చెప్పడం గమనర్హం. ఇలా రెవెన్యూలో జరుగుతున్న లీలలు అన్నీఇన్ని కావు.

కొందరు అధికారులు రెవెన్యూ భూములను దర్జాగా పట్టా భూములుగా మార్చేస్తున్నారు. పేరు, సర్వే నంబర్లు లేకుండా నివాసస్థలాలు, భూముల కేటాయింపు పట్టాలు బయటకు వస్తున్నాయి. పట్టా వెనుక తహసీల్దార్ సంతకం, కార్యాలయం స్టాంప్ వేసి ఉంటున్నాయి. నాలుగేళ్ల క్రితం నెల్లూరు తహసీల్దార్‌గా పని చేసిన అధికారి నేటికి నివాసస్థల పట్టాలు ఇస్తున్నారు. ఒక్కొక్క పట్టా రూ.లక్ష - 2 లక్షల వరకు పలుకుతోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. అధికారులు, సిబ్బంది కుమ్మకై భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. నష్టపోయిన బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరగడం వారి వంతైంది.


 ఆక్రమణల పర్వం..
జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకులమైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు అధికంగా జరుగుతున్నాయి. అధికారపార్టీని అడ్డుపెట్టుకొని కొందరు రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ భూములు ఆక్రమిస్తున్నారు. ఈ ప్రక్రియలో కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై అనేక ఫిర్యాదులు వస్తున్నా ఉన్నాతాధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండాపోతుంది.
 
 అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్
ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడే రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పు విషయం పరిశీలిస్తాం. పేర్లు మార్పు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు పరిరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.
 
 న్యాయం చేయండి :
 గ్రామంలోని సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమిని 1992లో నా భర్త మీరయ్యకు కేటాయించి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. రెవెన్యూ సిబ్బంది భూమిని అతని తల్లి పేరుతో మార్పు చేసుకున్నాడు. జిల్లా అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఖాసింబీ, నూకనపల్లి

మరిన్ని వార్తలు