గ్రేటర్‌లోని ప్లైవుడ్ డీలర్లే సూత్రధారులు

9 Jul, 2015 05:18 IST|Sakshi
గ్రేటర్‌లోని ప్లైవుడ్ డీలర్లే సూత్రధారులు

రూ. 100 కోట్ల విలువైన ప్లైవుడ్ అక్రమ రవాణా
♦ కేరళ నుంచి హైదరాబాద్‌కు వందలాది లారీల్లో సాగిన దందా
♦ కంపెనీ రిజిస్ట్రేషన్ మొదలు సి-ఫారం, వేబిల్లులన్నీ నకిలీవే!
♦ గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ
 
 సాక్షి, హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించి దొంగ సి-ఫారాలు, వే బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన ప్లైవుడ్‌ను దర్జాగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు ఇటీవలే రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ రేవతి రోహిణిల పర్యవేక్షణలో 15 రోజుల పాటు నిఘా నిర్వహించి ఎట్టకేలకు అక్రమ ప్లైవుడ్ రవాణా దందా సూత్రధారులను కనుగొన్నారు. హైదరాబాద్‌లో పేరు మోసిన ప్లై వుడ్ డీలర్లే కొంతమంది పేర్లతో బోగస్ రిజిస్టర్డ్ డీలర్‌ను సృష్టించి,  కేరళ నుంచి ఈ డీలర్‌కు వచ్చే ప్లైవుడ్‌ను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లుగా నకిలీ పత్రాలు తయారు చేసి, తమ దుకాణాల ద్వారా హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది.

 పన్నుల్లో భారీ కోత: త్రివేండ్రం, కొచ్చి తదితర నగరాల నుంచి హైదరాబాద్‌కు ప్లైవుడ్ రవాణా అవుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్లై వుడ్ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం చేసే వారు కేరళ నుంచి నేరుగా దిగుమతి చేయించుకుంటే 14.5 శాతం వ్యాట్ చెల్లించాలి. అదే కేరళలోని ప్లైవుడ్ కంపెనీతో సి- ఫారం ఉన్న రిజిస్టర్ డీలర్ లావాదేవీలు జరిపితే 2 శాతం పన్ను చెల్లిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు వాణిజ్యపన్నుల శాఖ రిజిస్ట్రేషన్లు, సి- ఫారాల జారీ, వేబిల్లులను సరళీం చేసేందుకు రూపొందించిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్(సీఆర్‌యూ)ను వినియోగించుకొన్నారు.

సింగిల్ విండో విధానం ద్వారా ‘ఫలానా ఎంటర్‌ప్రైజెస్’ అంటూ ఓ కంపెనీని రిజిస్టర్ చేయించి దొంగ సీ- ఫారాలు, వే బిల్లులు రూపొందించి కేరళలోని ప్లైవుడ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ బోగస్ డీలర్ పేర్లతో రోజూ కోట్ల విలువైన ప్లైవుడ్ కేరళ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లకు పంపుతున్నట్లు బిల్లులు రూపొందించి ఇతర జిల్లాలతో వ్యాపారం చేసేవారు.

 గుట్టు రట్టైంది ఇలా: కొన్నాళ్లుగా హైదరాబాద్‌కు ప్లైవుడ్ పెద్ద ఎత్తున రవాణా కావడం, పన్ను మాత్రం 2 శాతమే ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణి నిఘా విభాగాన్ని అప్రమత్తం చేశారు. కేరళ నుంచి ప్లైవుడ్‌ను దిగుమతి చేసుకుంటున్న డీలర్ వివరాలు ఆరా తీస్తే పేరు, ఫోన్ నంబర్, పాన్ నంబర్, టిన్,  అడ్రస్ మొదలుకొని జరిగే వ్యాపారం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి అంతా మోసంగా తేలింది.

దీంతో కేరళ నుంచి వస్తున్న లారీలపై నిఘా పెట్టి ఆన్‌లైన్ ద్వారా ఆపరేట్ చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్‌లో వివరాలను గుర్తించారు. దీంతో బండారం బయటపడింది. రూ. 100 కోట్ల విలువైన ప్లైవుడ్ 2 శాతం పన్నుతో కొంతకాలంగా రాష్ట్రానికి దిగుమతి అయినట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు గుర్తించారు. దిగుమతి అయిన ప్లైవుడ్‌పై వాణిజ్యపన్నుల శాఖ విధించిన పన్ను రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు