ఒకే రోజు ఆర్టీసీకి రూ.14.19 కోట్ల ఆదాయం

29 Oct, 2015 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దసరా సెలవులకు ఊళ్లకెళ్లిన వారు తిరిగి పట్టణాలకు తిరుగుముఖం పట్టడంతో గత సోమవారం ఆర్టీసీ రికార్డుస్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ.9.80 కోట్ల ఆదాయం నమోదవుతుండగా, సోమవారం రూ.14.19 కోట్ల మేర నమోదైంది. ఇటీవలి కాలంలో ఒకేరోజు ఇంత మొత్తం ఆదాయం రావటం ఇదే తొలిసారి, గత గురువారం దసరా నేపథ్యంలో ఊళ్లకు వెళ్లినవారిలో చాలామంది మొహర్రం సెలవు తర్వాత సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.

ఒకేరోజు లక్షల సంఖ్యలో ప్రయాణికులు పోటెత్తటంతో ఓ దశలో బస్సులు సరిపోలేదు. సాధారణంగా పండగల తర్వాత ఒకేరోజు ఇంతపెద్దమొత్తం ఆదాయం సమకూరటం అరుదు. ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలో మాత్రం ఇంతకంటే ఎక్కువగా నమోదైనప్పటికీ దాన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించి అధికారులు లెక్కలోకి తీసుకోరు. ప్రతి సంవత్సరం వచ్చే పండగ సెలవులను మాత్రం గమనంలోకి తీసుకుంటున్న అధికారులు దీన్ని రికార్డుగా పరిగణిస్తున్నారు.

మరిన్ని వార్తలు