బెజవాడలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

28 Jun, 2017 22:05 IST|Sakshi

విజయవాడ: టీటీడీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో పి.భాస్కర్‌ వెల్లడించారు. నగరంలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయం, ఇతర ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇక్కడి భక్తులు దర్శించేందుకు వీలుగా వైభవోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఇప్పటివరకు విశాఖపట్నం, గుంటూరు, ముంబయి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో  శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నాడు-నేడు అనే అంశంతో ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్‌, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ, ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భక్తులకు సేవలందించేందుకు స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.

ఉత్సవాల కోసం శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తామని జేఈవో తెలిపారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన,  5న సహస్రకలశాభిషేకం,  6న తిరుప్పావడ,  7న అభిషేకం,  8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, 9న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకు ముందు శ్రీవారి నమూనా ఆలయం, క్యూలైన్లు, పార్కింగ్‌ తదితర ఇంజినీరింగ్‌ పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.
 

మరిన్ని వార్తలు