త్వరలో కొత్త జాతీయ రహదారులు

28 Jul, 2015 01:18 IST|Sakshi
త్వరలో కొత్త జాతీయ రహదారులు

1,018 కి.మీ. రోడ్లకు కేంద్ర మంత్రి హామీ
 
*  గడ్కారీని కలసిన మంత్రి తుమ్మల, ఎంపీల బృందం
సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణలో త్వరలో కొత్తగా 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. గత 50 ఏళ్లలో రాని రహదారులను 5 ఏళ్లలో ఇస్తామని భరోసా ఇచ్చారు. రహదారుల గురించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్, మరికొందరు టీఆర్‌ఎస్ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్‌లో కేంద్ర మంత్రి గడ్కారీని కలసి వినతి పత్రాన్ని అందచేసింది.

భేటీ అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల సమస్యను, వామపక్షతీవ్రవాద ప్రాబల్యప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్ల నిర్మాణాల అంశాలను గడ్కరీ దృష్టికి తెచ్చామన్నారు. డ్రైపోర్టులు, జలరవాణా మార్గాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న 1,018 కి.మీలలో 220 కి.మీ కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి చెప్పారు.

కాగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలు, ప్రాజెక్టులన్నిటినీ తెలంగాణకు వర్తింప చేయాలని మంత్రి తుమ్మల.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
 
అశోక గజపతిరాజుతో తుమ్మల భేటీ
పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖ స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రతిపాదనలు, కొత్తగూడెం, వరంగల్‌లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇచ్చే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దానిని పౌరవిమానాశ్రయంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు